Web Werks to invest 5200 crore in Telangana: హైదరాబాద్: దావోస్‌లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణలో తమ పెట్టుబడులకు కంపెనీలు ఒప్పందాలు చేసుకుంటున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy), మంత్రి శ్రీధర్ బాబు, అధికారులు రాష్ట్రానికి పెట్టుబడుల కోసం దిగ్గజ కంపెనీల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నారు. తాజాగా తెలంగాణలో రూ.5200 కోట్ల పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ సంస్థ (Investments In Telangana) ముందుకొచ్చింది. రాష్ట్రంలో డేటా సెంటర్లను నెలకొల్పేందుకు నిర్ణయం తీసుకుంది. వెబ్ వెర్క్స్ డేటా సెంటర్ల నిర్వహణలో అగ్రగామి సంస్థల్లో ఒకటైన ఐరన్ మౌంటెన్ అనుబంధ సంస్థ వెబ్ వెర్క్స్. దావోస్‌లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఐరన్ మౌంటేన్ సీఈవో విలియం మీనీ, వెబ్ వెర్క్స్ సీఈవో నిఖిల్ రాఠీతో సమావేశమయ్యారు.
తెలంగాణలో డేటా సెంటర్ల ఏర్పాటు, నిర్వహణపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా రూ.5200 పెట్టుబడులకు వెబ్ వెర్క్స్ కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకుంది. ఈ కంపెనీ హైదరాబాద్‌లో 10 మెగావాట్ల నెట్ వర్కింగ్-హెవీ డేటా సెంటర్‌లో రూ.1,200 కోట్లు పెట్టుబడి పెట్టింది. అదనంగా 4,000 కోట్లకు పైగా పెట్టుబడులతో కొన్నేళ్లలో గ్రీన్ ఫీల్డ్ హైపర్ స్కేల్ డేటా సెంటర్ విస్తరించేందుకు దావోస్ లో ఒప్పందం చేసుకుంది.
వెబ్ వెర్క్స్ నిర్ణయాన్ని స్వాగతించిన రేవంత్ రెడ్డి
రాష్ట్రంలో డేటా సెంటర్ల ఏర్పాటును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతించారు. డేటా సెంటర్ల ద్వారా ఐటీ రంగం అత్యున్నతంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. దేశంలోనే డేటా సెంటర్ల ఏర్పాటుకు తెలంగాణ అసలైన గమ్యస్థానంగా నిలుస్తుందన్నారు. ఇన్వెస్టర్లు అవసరమైన విద్యుత్తును కూడా పునరుత్పాదక వనరుల ద్వారా సమకూర్చుకుంటున్నారని తెలిపారు. తమ కొత్త ప్రభుత్వం అనుసరించే వ్యాపార అనుకూల విధానాలు, తాము ఎంచుకున్న ఫ్రెండ్లీ పాలసీపై వాళ్లకున్న నమ్మకాన్ని చాటి చెపుతోందన్నారు.
దేశంలో తమ డేటా సెంటర్ కార్యకలాపాలను విస్తరించడంపై ఐరన్ మౌంటైన్ ఆనందం వ్యక్తం చేసింది. ‘తెలంగాణ రాష్ట్రానికి స్పష్టమైన ప్రాధాన్యతలున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మా డేటా సెంటర్‌లలో 100% పునరుత్పాదక శక్తిని ఉపయోగిస్తున్నాము. దీనిని భారతదేశంలో విస్తరించాలని చూస్తున్నాం. కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం డేటా సెంటర్లు మరియు పునరుత్పాదక ఇంధనం రెండింటికి మద్దతు అందించటం ద్వారా పెట్టుబడులను ఆకర్షణీయంగా మార్చిందని’ విలియం మీనీ అన్నారు.
తెలంగాణలో అదానీ గ్రూప్ రూ.12,400 కోట్ల భారీ పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకుంది. గోడి ఇండియా రూ.8000 కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకోగా, తొలి దశలో 6 వేల మందికి ఉద్యోగం లభించనుంది. తెలంగాణలో JSW రూ.9 వేల కోట్ల పెట్టుబడికి నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రతినిధులతో అందుకు సంబంధించి ఒప్పందాలు చేసుకుంది.