Kavitha Social Media accounts hacked: హైదరాబాద్: సైబర్ నేరగాళ్లు తెలంగాణలో ప్రముఖులు ఒక్కొక్కరికి షాకిస్తున్నారు. వారి సోషల్ మీడియా ఖాతాలు హ్యాక్ చేస్తున్నారు. మొన్న మంత్రి దామోదర రాజనర్సింహ ఫేస్ బుక్ హ్యాక్ కాగా, ఈరోజు గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ ను హ్యాక్ (Tamilisai Twitter Account Hacked) చేశారు సైబర్ నేరగాళ్లు. తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) ట్విట్టర్ అకౌంట్ హ్యాకింగ్ కు గురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ విషయంపై తాను సైబర్ క్రైమ్ పోలీసులకు, డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తానని కవిత తెలిపారు. సోషల్ మీడియా ఖాతాలను పూర్తి స్థాయిలో తిరిగి పునరుద్ధరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు.


బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ తో పాటు ఇన్‌స్టాగ్రామ్ ఖతాలు కూడా హ్యాక్ కు గురయ్యాయి. సైబర్ నేరగాళ్లు మంగళవారం నాడు రాత్రి 10 గంటల నుంచి బుధవారం ఉదయం 11 గంటల వరకు వరుసగా పలు సార్లు హ్యాకింగ్ కు యత్నించారనని ఆమె తెలిపారు.  అనుమానాస్పదంగా లాగిన్ అయ్యి సైబర్ నేరగాళ్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో సంబంధం లేని ఒక వీడియోను పోస్టు చేశారు. వెంటనే గుర్తించిన కవిత తన సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గురైనట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. దీనిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి, సైబర్ సెక్యూరిటీ విభాగానికి ట్యాగ్ చేశారు.


 






గవర్నర్ తమిళిసై ట్విట్టర్ అకౌంట్ హ్యాక్..
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ ట్విట్టర్ అకౌంట్‌ హ్యాక్‌కు గురైంది. గవర్నర్ తమిళిసై ట్విట్టర్‌ అకౌంట్‌ను హ్యాక్ చేసినట్లు రాజ్ భవన్ అధికారులు బుధవారం ఉదయం వెల్లడించారు. తమిళి సై ట్విట్టర్ హ్యాక్ కావడంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. గతంలో కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సోషల్ మీడియా ఖాతాలు హ్యాకింగ్ కు గరయ్యాయి. తాజాగా గవర్నర్ తమిళిసై, ఎమ్మెల్సీ కవితను టార్గెట్ గా వారి సోషల్ మీడియా ఖాతాల్ని హ్యాక్ చేశారు.


మంత్రి దామోదర రాజనర్సింహకు సైబర్ నేరగాళ్లు షాక్! 
నకిలీ వెబ్ సైట్స్, ఫేక్ లింక్స్ సృష్టించి డబ్బులు దండేయడమే కాకుండా సోషల్ మీడియా వేదికగానూ మోసాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఫేస్ బుక్ పేజీనే హ్యాక్ చేశారు. తాజాగా, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ (Damodara Raja Narasimha) ఫేస్ బుక్ పేజీని హ్యాక్ చేసి వేరే పార్టీలకు చెందిన పోస్టులు చేశారు. ఆయన ఫేస్ బుక్ పేజీలో బీజేపీటీడీపీ, తమిళనాడుకు చెందిన రాజకీయ పార్టీలకు చెందిన పోస్టులు వందల సంఖ్యలో దర్శనమిచ్చాయి. దీంతో ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు షాకయ్యారు.