Weather Updates: విపరీతమైన ఎండలు, వడగాలులతో అల్లాడిపోయిన తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం చల్లబడింది. రుతుపవనాల విస్తరణతో పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో రైతులతోపాటు సామాన్య జనం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఉత్తరకోస్తా, దక్షిణ ఒడిశాకు ఆనుకొని బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం నైరుతి రుతుపవనాల విస్తరణకు దోహదం చేసింది.


అల్పపీడనం ప్రభావం ఏపీతో పాటు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, బిహార్‌ రాష్ట్రాలపై ఉంటుంది. ఫలితంగా కొన్ని ప్రాంతాలకు నైరుతి  రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కారణంగా రానున్న 48 గంటల్లో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవనున్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. శుక్రవారం మన్యం, అనకాపల్లి, అల్లూరి, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.






శ్రీకాకుళం, విజయనగరం, విశాఖఫట్నం, కాకినాడ, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, శ్రీసత్య సాయి, అనంతపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. శనివారం రోజు అల్లూరి, తూర్పు గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. 


తెలంగాణలో మూడ్రోజుల పాటు వర్షాలు ఇలా..!


నైరుతి రుతుపవనాలు కేవలం తెలంగాణలోని ఖమ్మం జిల్లాలోకి మాత్రమే ప్రవేశించగా... మరో రెండు, మూడు రోజుల్లో అవి రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనంతో మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈనెల 25, 26 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రానికి ఎల్లో, ఆరెంజ్, అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్ర ప్రకటనతో రైతన్నలు సాగుకు సమాయత్తం కాబోతున్నారు. 






జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపే జిల్లాల్లో 24వ తేదీ రోజు తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. 25వ తేదీ రోజు ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో తేలిక పాటి నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని స్పష్టం చేసింది. 26వ తేదీన ఆదిలాబాద్, కుమురం భఈం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. అలాగే నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని ప్రకటించింది. ఈ వార్తతో రాష్ట్ర ప్రజలందరూ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.