నిన్న దక్షిణ ఛత్తీస్ గఢ్ & పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం, దక్షిణ తెలంగాణ దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న మరొక ఆవర్తనం ఈరోజు బలహీన పడ్డాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు మంగళవారం (మే 30) ఓ ప్రకటనలో తెలిపారు. ఈ రోజు ఉత్తర దక్షిణ ద్రోణి పశ్చిమ విదర్భ నుండి మరత్వాడ, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక మీదుగా దక్షిణ తమిళనాడు వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి.మి ఎత్తు వద్ద కొనసాగుతుందని వివరించారు. 


ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో రాగల 3 రోజులకు వాతావరణ సూచనను అధికారులు అంచనా వేశారు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు మరియు ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాగల 3 రోజులు గరిష్ట (పగటి) ఉష్ణోగ్రతలు  39 డిగ్రీల నుండి 42 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది. హైదరాబాద్ మరియు చుట్టూ ప్రక్కల జిల్లాలలో పగటి ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల నుండి 40 డిగ్రీల వరకు నమోదు అయ్యే అవకాశం ఉంది.


ఈ రోజు ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 40 నుండి 50 కిమీ)తో  కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో (పశ్చిమ, దక్షిణ) అక్కడక్కడ వచ్చే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ) తో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వచ్చే అవకాశం ఉందని అన్నారు. 


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీలు, 28 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు వాయువ్య దిశ నుంచి గాలి వేగం గంటకు 6 నుంచి 08 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 39.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 25.6 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 63 శాతంగా నమోదైంది.


ఏపీలో ఇలా
‘‘ఒడిశాలో మొదలైన వర్షాలు నేరుగా శ్రీకాకుళం జిల్లాలోకి దూసుకొస్తున్నాయి. దీని వలన శ్రీకాకుళం జిల్లాలోని శ్రీకాకుళం నగరం - రణస్థలం పరిధిలో భారీ పిడుగులు, వర్షాలు నేరుగా జిల్లాలోకి విస్తరించనున్నాయి. కొన్ని చోట్లల్లో పిడుగులు విపరీతంగా ఉండనున్నాయి. అల్లూరిసీతారామరాజు జిల్లాలోని కొండ ప్రాంతాలు ముఖ్యంగా అరకు వ్యాలీ - పార్వతీపురం మన్యం జిల్లాలోని పలు భాగల్లో వర్షాలు, తీవ్రమైన పిడుగులు విస్తరిస్తున్నాయి. మరోవైపున చిత్తూరు జిల్లాలోని పశ్చిమ భాగాలు, అన్నమయ్య జిల్లాలోని పశ్చిమ భాగాల్లో విస్తరిస్తున్న భారీ వర్షాలు నేరుగా సత్యసాయి జిల్లాలోని తూర్పు భాగాల్లోకి విస్తరించనున్నాయి. మరోవైపున తిరుపతి జిల్లాలోని సత్యవేడు వైపుగా కురుస్తున్న భారీ వర్షాలు నేరుగా తమిళనాడు చెన్నై వైపుగా వెళ్లనున్నాయి’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.