Russia Ukrain War: రష్యా రాజధాని మాస్కోపై మంగళవారం డ్రోన్ల దాడి జరిగింది. ఈ దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నట్లు రష్యా తెలిపింది. తెల్లవారుజామున ఈ దాడి జరిగిందని, మాస్కోలోకి ప్రవేశిస్తున్న ఎనిమిది డ్రోన్లను నిలువరించినట్లు రష్యా వెల్లడించింది. దీనికి ఉక్రెయినే కారణమని, ఈ ఘటనను కీవ్ ఉగ్రదాడిగా రష్యా అభివర్ణించింది. రష్యా - ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి మాస్కోలోని నివాస ప్రాంతాలపై దాడి జరగడం ఇదే మొదటిసారి. దీంతో రష్యా ప్రతీకార దాడులకు దిగింది. ఉక్రెయిన్ రాజధాని నగరం కీవ్ పై బాంబుల వర్షం కురిపించింది.
అప్పుడు అధ్యక్ష భవనంపై, ఇప్పుడు నివాస ప్రాంతాలపై
ఈ నెలలో మాస్కోపై డ్రోన్ దాడి జరగడం ఇది మొత్తంగా రెండోసారి. ఇంతకుముందు రష్యా అధ్యక్ష భవనంపై దాడి చేసి పుతిన్ ను చంపేందుకు ఉక్రెయిన్ డ్రోన్లు వచ్చినట్లు రష్యా అధికారులు వెల్లడించారు. వాటిని వెంటనే కూల్చేసినట్లు తెలిపారు. తాజాగా జరిగిన దాడి మాత్రం మాస్కోలోని నివాస ప్రాంతాలపై జరిగింది. ఇలా నివాస ప్రాంతాలపై దాడి జరగడం ఇదే మొదటి సారి అని అధికారులు తెలిపారు. ఈ తాజా దాడిలో పలు భవనాలు దెబ్బతిన్నట్లు మాస్కో మేయర్ సెర్గీ సోబియానిన్ ప్రకటించారు. ఇద్దరు పౌరులకు స్వల్ప గాయాలు అయ్యాయని వెల్లడించారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు మాస్కో మేయర్ తెలిపారు. డ్రోన్ దాడిలో దెబ్బతిన్న భవనాల్లో నివసిస్తున్న వారిని రష్యా అధికారులు ఖాళీ చేయించారు. మాస్కోలోకి ప్రవేశిస్తున్న మరో ఎనిమిది డ్రోన్లను పేల్చేసినట్లు తెలిపారు.
డ్రోన్‌లు కూల్చివేత
ఉక్రెయిన్‌పై రష్యా సంచలన ఆరోపణలు చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ కుట్ర చేసిందని ఆరోపించింది. రెండు డ్రోన్‌లను పుతిన్ ఆఫీస్‌పైకి పంపిందని, వాటిని తమ సైనికులు పేల్చి వేశారని వెల్లడించింది. దీనికి కచ్చితంగా బదులు తీర్చుకుంటామని ప్రకటించింది. దీన్ని ఓ ఉగ్రదాడిగానే భావిస్తున్నట్టు స్పష్టం చేసింది. మాస్కోలో డ్రోన్‌లపై నిషేధం విధించింది.
"ఉక్రెయిన్ పుతిన్ హత్యకు కుట్ర పన్నింది. రెండు డ్రోన్‌లు పుతిన్ ఆఫీస్‌పైకి వచ్చాయి. వాటిని గుర్తించి వెంటనే పేల్చి వేశాం. దీన్ని ఉగ్రదాడిగానే భావిస్తున్నాం. సరైన బదులు కచ్చితంగా ఇచ్చి తీరతాం. క్రెమ్లిన్‌ను టార్గెట్ చేస్తూ రెండు డ్రోన్‌లు దూసుకొచ్చాయి. వెంటనే పేల్చేశాం. ఈ ఘటనలో పుతిన్‌కు ఎలాంటి గాయాలు కాలేదు. క్రెమ్లిన్ బిల్డింగ్‌కి కూడా ఎలాంటి డ్యామేజ్ అవలేదు" - రష్యా