ద్రోణి ఇప్పుడు బిహార్ నుండి సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, విదర్భ, తెలంగాణకు, ఉత్తర ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలో మీటర్ల దూరంలో నడుస్తుందని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. రాయలసీమ & పరిసర ప్రాంతాలలో తుపాను ప్రసరణ సముద్ర మట్టానికి 1.5 కి.మీ ఎత్తులో తక్కువగా ఉంటుంది.


ఈ వాతావరణ పరిస్థితుల వల్ల తెలంగాణలో కొన్ని చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, కొన్ని చోట్ల జల్లులు కురిసే అవకాశం ఉంది. రేపు కూడా (మార్చి 27న) తెలంగాణలో ఒకటి రెండు చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన వర్షం, జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ అధికారులు తెలిపారు. మార్చి 28న మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని తెలిపారు.


వెదర్ వార్నింగ్స్ ఇవీ
నేడు (మార్చి 26) తెలంగాణలోని అదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్,
మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల్ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. గాలులు (30-40 kmph) వేగంతో వీచే అవకాశం చాలా ఉంది. 27న కూడా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉంది.



హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 33 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. దక్షిణ దిశల నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలో నేడు అక్కడక్కడా వర్షాలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతిలోని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు ఉత్తర కోస్తా, యానంలోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడా చెదురుమదురు వర్షాలు పడతాయని అంచనా వేశారు. రాయలసీమలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు తప్ప మిగిలిన చోట్ల వర్షం ఉంటుందని తెలిపారు. దాదాపు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేశారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


ఈ వర్షాల వల్ల పంట నష్టం జరుగుతుందని, అరటి చెట్లకు నష్టం జరుగుతుందని చెప్పారు. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని, వర్షాల సమయంలో బయటకు వెళ్లవద్దని సూచించారు. ముఖ్యంగా వర్షాలు పడుతున్న వేళ చెట్ల కింద ఉండొద్దని చెప్పారు. కరెంటు స్తంభాలు, వైర్లకు దూరంగా ఉండాలని సూచించారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
గత వారం రోజుల నుంచి పలు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందారు. భారత వాతావరణ శాఖ ప్రకారం, ఈ రోజు రాజధానితో సహా దేశంలోని అనేక ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో ఆదివారం (మార్చి 26) మెరుపులతో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉంది.


ఛత్తీస్‌గఢ్, విదర్భలోని కొన్ని ప్రాంతాల్లో వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దీని కారణంగా తూర్పు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్‌గఢ్‌లకు ఎల్లో అలర్ట్ జారీ చేయబడింది. సమాచారం ప్రకారం, మార్చి 1, 23 మధ్య, విదర్భలో 14.2 మిమీ, మధ్యప్రదేశ్‌లో 20.5 మిమీ, ఛత్తీస్‌గఢ్‌లో 31.2 మిమీ వర్షం నమోదైంది. ఇది కాకుండా, అల్వార్, భరత్‌పూర్, ధౌల్‌పూర్, కరౌలి, శ్రీగంగానగర్, హనుమాన్‌గఢ్ జిల్లాలు మరియు రాజస్థాన్ పరిసర ప్రాంతాలలో, తేలికపాటి వర్షం మరియు వడగళ్ళతో పాటు గంటకు 20.40 కి.మీ వేగంతో బలమైన గాలులు కూడా పడే అవకాశం ఉంది.