ఈ రోజు ద్రోణి / గాలిలోని అనిచ్చితి పశ్చిమ విధర్బలోని ఆవర్తనం నుండి మరత్వాడ మీదగా దక్షిణ ఇంటీరియర్ కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 1.5 కి మీ ఎత్తు వరకు కొనసాగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దిగువ స్థాయిలోని గాలులు దక్షిణ/ఆగ్నేయ దిశల నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి.


రాగల ఐదు రోజులకు రాష్ట్రంలో  పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల 35 డిగ్రీల సెంటీగ్రేడ్ కన్నా తక్కువగా అక్కడక్కడ నమోదు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఈ రోజు నుండి 3 రోజుల పాటు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులు (ఈ రోజు గాలి గంటకు 40 నుండి 50  కి మీ వేగంతో, రేపు ఎల్లుండి 30 నుండి 40 కిలోమీటర్ల వేగం)తో పాటు వడగళ్ళతో కూడిన వర్షాలు అక్కడక్కడ వీచే అవకాశం ఉంది.


తెలంగాణలో నేడు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగామ, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు ఈదురుగాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వడగండ్లతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లా్ల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. రేపు కూడా తెలంగాణలోకి కొన్ని జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. తేలికపాటి నుంచి మోస్తరు వర్షం లేదా ఉరుములు, వడగండ్లతో ఈదురు గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వర్షాలు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు 8 నుంచి 10 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.9 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 79 శాతం నమోదైంది.


నిన్న ఇక్కడ భారీ వర్షాలు
తెలంగాణలో జనగామ, నల్గొండ, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ వడగళ్ల వాన కురిసింది. జగిత్యాల, కరీంనగర్ జిల్లాల్లో కొన్ని చోట్ల భారీ వర్షం కురిసింది. హైదరాబాద్ లోనూ నిన్న సాయంత్రం భీకరమైన గాలులు వీచాయి. దాంతో పాటు భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి నేడు ఉదయం వరకూ తేలికపాటి వర్షం కురుస్తూనే ఉంది.


ఏపీలో నేడు వాతావరణం ఇలా
నేడు ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేగంగా గాలులు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో అక్కడక్కడ వీచే అవకాశం ఉందని అంచనా వేశారు. 


‘‘గత మూడు రోజులుగా కోస్తాంధ్రలో వర్షాలు పడుతున్నాయి. గాలుల సంగమంతో పాటుగా ఉపరితల ఆవర్తనం కోస్తాంధ్రను అనుకూలించడం వలన వర్షాలు మనకు కోస్తాంధ్రలోనే బాగా పడుతున్నాయి. కానీ నేడు, రేపు తెలంగాణ​, రాయలసీమ జిల్లాల్లోకి తరలివెళ్లనుంది కాబట్టి నేడు రాయలసీమ జిల్లాలైన అనంతపురం, సత్యసాయి, అన్నమయ్య​, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ రాత్రి సమయంలో వర్షాలు పడే అవకాశం ఉంది. కర్నూలు, నంద్యాల​, కడప జిల్లాల్లో 50% అవకాశాలు మాత్రమే ఉంది. ఎందుకంటే గాలుల సంగమం అనంతపురానికి ఉత్తరాన అంత బలంగా లేదు. అలాగే  మధ్యాహ్నం, సాయంకాలం సమయంలో పార్వతీపురం మణ్యం, అల్లూరిసీతారామరాజు జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలుంటాయి. మిగిలిన కోస్తాంధ్రలో కూడ ఒకటి, రెండు చోట్లల్లో వర్షాలను చూడగలము.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ వివరించారు.