ఏపీ, తెలంగాణలో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి, హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రాల అధికారులు వేర్వేరు ప్రకటనల్లో వెల్లడించారు. అదే సమయంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని తెలిపారు. అమరావతిలోని వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో పొడి గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ ఎలాంటి వర్షం ఉండబోదని వెల్లడించారు. అలాగే వాతావరణం పొడిగా ఉంటుందని అంచనా వేశారు.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం, దక్షిణ కోస్తా ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. చలి ప్రభావం దాదాపుగా తగ్గిపోయింది.






‘‘మధ్యాహ్న సమయం ఉష్ణోగ్రతలు 34 నుంచి 38 దాకా కొనసాగుతున్నాయి. ఈ రోజు వేడిగాలుల ప్రభావం ముఖ్యంగా గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కొనసాగుతోంది. అలాగే మరో వైపున కర్నూలు, కడప​, అనంతపురం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో కూడ కాస్తంత వేడిగా ఉంది. విశాఖ నుంచి నెల్లూరు దాక 100% తేమ ఉండటంతో ఉక్కపోతగా ఉన్నప్పటికీ అంత ఎండైతే లేదు. అలాగే చిత్తూరు జిల్లాలో కూడా కస్తంత వేడి వాతావరణం కొనసాగుతోంది. మరో వైపున తూర్పు తెలంగాణ జిల్లాలు భద్రాద్రి కొత్తగూడం, సూర్యాపేట​, ఖమ్మం, నల్గొండ​, వరంగల్ రూరల్/అర్బన్, మహబూబాబాద్ లో వేడి వాతావరణం కొనసగుతోంది. కొన్ని చోట్ల 38 డిగ్రీలను తాకుతోంది. హైదరాబాద్ లో అంతగా ఏమి వేడి లేదు.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.



తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం అంతా పొడిగానే ఉంటుంది. ఇలాంటి పరిస్థితే మరో మూడు నాలుగు రోజులు ఉండనుందని అంచనా వేశారు. ఉష్ణోగ్రతలు రోజురోజుకీ మరింతగా పెరగనున్నాయి. హైదరాబాద్‌లో వాతావరణం పొడిగా, ఎండగా ఉండే ఆకాశం ఉంటుంది. ఉదయం సమయంలో అక్కడక్కడా పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంది. గత 24 గంటల్లో గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 35 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉంది. సాధారణంగా 1.8 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది.