తెలంగాణలో మార్చి 24, 25 తేదీల్లో రెండ్రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. సోమవారం తమిళనాడు నుంచి ఉన్న ద్రోణి మంగళవారం నాటికి దక్షిణ శ్రీలంక నుంచి తమిళనాడు, రాయలసీమ, తెలంగాణ మీదుగా మధ్యప్రదేశ్‌ వరకు విస్తరించింది. దీని ఫలితంగానే రాష్ట్రంలోని పలుచోట్ల అక్కడక్కడా ఓ మోస్తరు జల్లులు కురుస్తాయని వాతావరణశాఖ పేర్కొంది.పగటి, రాత్రి ఉష్టోగ్రతలు సాధారణం కంటే మూడు డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణశాఖ పేర్కొంది.


తెలంగాణలో వాతావరణ స్థితి
తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో వర్షాలు పడతాయని చెప్పారు. అలాగే, 25వ తేదీ నుంచి మూడు రోజుల పాటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక చలి విషయంలో రాష్ట్రం మొత్తం సాధారణ ఉష్ణోగ్రతలే ఉండగా, భద్రాద్రి కొత్తగూడెం, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో మాత్రం నేడు చలి విషయంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. ఉదయం సమయంలో పొగమంచు ఏర్పడే అవకాశం ఉంది. రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 21 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.4 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 20 డిగ్రీలుగా నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఏపీలోని దాదాపు అన్ని ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై జల్లులు పడుతున్నాయి. నేడు కూడా ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు  తెలిపారు.


ఢిల్లీలో వాతావరణం ఇలా..
ఐదు నెలల్లో ఢిల్లీలో అత్యంత స్వచ్ఛమైన గాలి మంగళవారం నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 75కి మెరుగుపడిన తర్వాత పరిస్థితి 'సంతృప్తికరమైన' కేటగిరీలో ఉంది. అంతకుముందు ఢిల్లీలో గతేడాది అక్టోబర్ 11న ఏక్యూఐ 66 కంటే తక్కువగా నమోదైంది. వర్షం, బలమైన గాలులు ఢిల్లీ గాలిని క్లియర్ చేశాయి.