నిన్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం పక్కనున్న దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ వద్ద ఉన్న అల్పపీడన ప్రాంతం ఈ రోజు బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ అల్పపీడన ప్రాంతానికి అనుబంధంగా ఉన్న అవర్తనం నైరుతి విదర్భ & పరిసరాల్లోని దక్షిణ ఛత్తీస్ ఘడ్ వద్ద కొనసాగుతూ సగటు సముద్ర మట్టం నుండి 4.5 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
సుమారుగా 24వ తేదీన ఒక అల్పపీడన ప్రదేశం, దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ దగ్గరలోని వాయువ్య బంగాళాఖాతం & పరిసరాలలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఈరోజు ఒక ఆవర్తనం దక్షిణ ఒడిశా - ఉత్తర ఆంధ్రప్రదేశ్ పక్కనున్న వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడి సగటు సముద్రమట్టం నుండి 7.6 కి మీ ఎత్తు వరకు వ్యాపించి ఉంది.
నిన్న దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆవర్తనం ఈ రోజు నైరుతి విదర్భ & పరిసరాల్లోని దక్షిణ ఛత్తీస్ గడ్ వద్ద ఉన్న ఆవర్తనంలో కలిసిపోయింది. ఈ రోజు కూడా షీయర్ జోన్ 20°N అక్షాంశం వెంబడి సగటు సముద్ర మట్టం నుండి 3.1 కిమీ నుండి 7.6 కిమి ఎత్తువరకు స్థిరంగా కొనసాగుతూ ఎత్తుకు వెళ్లే కొలది దక్షిణ దిశ వైపు వంగి ఉంది.
రాగల ఐదు రోజులు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది. రాగల మూడు రోజులు భారీ వర్షాలు తెలంగాణలో కొన్ని జిల్లాలలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. 25, 26 తేదీలలో భారీ నుండి అతి భారీవర్షాలు (ఆరంజ్ అలెర్ట్ ) తెలంగాణ రాష్ట్రంలో అక్కడక్కడ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాగల 5 రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఉరుములు మెరుపులతో పాటు ఈదురుగాలులు, గాలి వేగం గంటకు 30 నుండి 40 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంది.
హైదరాబాద్ లో ఇలా
‘‘ఆకాశం పాక్షికంగా మేఘావృతంగా ఉంటుంది. సాయంత్రం లేదా రాత్రి సమయంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం లేదా చినుకులు పడే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 28 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు నైరుతి దిశ నుంచి గాలి వేగం గంటకు 10 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 23 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 87 శాతంగా నమోదైంది.
ఏపీలో ఇలా
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం, నైరుతి రుతుపవనాల వల్ల ఏపీలో అక్కడక్కడా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. రాబోయే మూడు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. రేపటి నుంచి బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అంచనా వేసింది.
అదే సమయంలో గంటకు 30 నుంచి 40 కి మీల వేగంతో బలమైన గాలులు కూడా వీస్తాయని తెలిపింది. అల్పపీడనం రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడ నుందని ఐఎండీ తెలిపింది. అనంతరం పశ్చిమ వాయవ్య దిశగా దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మీదుగా అది పయనిస్తుందని అంచనా వేసింది.