Weather Latest News: పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఒకటి కేంద్రీకృమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ద్రోణి / గాలి విచ్ఛిన్నతి ఒకటి దక్షిణ తమిళనాడు నుంచి అంతర్గత కర్ణాటక మీదుగా పశ్చిమ విదర్భ, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం వరకు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో కొనసాగుతుందని తెలిపారు.
ఈ రోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడ అక్కడ ఎల్లుండి కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈరోజు, రేపు తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులు, వడగళ్ళతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు, ఎల్లుండి ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుండి 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు అక్కడ అక్కడ కురిసే అవకాశం ఉంది. 19న తెలంగాణలోని నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లోని ఏకాంత ప్రదేశాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్లవాన పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు.
Hyderabad Weather: హైదరాబాద్ వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. నగరంలో తేలికపాటి చినుకులు కురిసే అవకాశం ఉంది. ఉదయం వేళల్లో పొగమంచు పరిస్థితులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 35 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఆగ్నేయ దిశగా ఉండే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 33.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 24.3 డిగ్రీలుగా నమోదైంది. 71 శాతంగా గాలిలో తేమ శాతం నమోదైంది.
ఆంధ్రప్రదేశ్ వాతావరణం
Andhra Pradesh Weather: పశ్చిమ విదర్భ నుంచి మరఠ్వాడా, అంతర్భాగ కర్ణాటక మీదుగా ఉత్తర కేరళ వరకు ఉన్న ద్రోణి.. ఇప్పుడు దక్షిణ తమిళనాడు నుంచి అంతర్భాగ కర్నాటక మీదుగా పశ్చిమ విదర్భ, పొరుగు ప్రాంతాల మీద ఉన్న ఉపరితల ఆవర్తనం వరకు, ద్రోణి, గాలుల నిలిపివేత (గాలుల కోత)గా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు సగటు సముద్ర మట్టానికి సగటున 0.9 కిలో మీటర్ల ఎత్తులో ద్రోణి వ్యాపించి ఉందని తెలిపారు.
ఈ ప్రభావంతో దక్షిణ కోస్తా ఆంధ్రలో వాతావరణం పొడిగానే ఉంటుందని అమరావతి వాతావరణ అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని తెలిపారు. రాయలసీమలో ఎక్కువగా వాతావరణం పొడిగా ఉంటుందని చెప్పారు. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఒకటి లేదా రెండు చోట్ల ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.