Weather Latest News: ఏపీలో వచ్చే మూడు రోజుల వరకూ రాష్ట్రంలో వానలు పడే అవకాశం ఉన్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. ఉత్తర కోస్తా, యానాం ప్రాంతాల్లో నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. నేడు, రేపు, ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. రాయలసీమలో ఈరోజు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు ఓ ప్రకటన విడుదల చేశారు.
బలమైన నైరుతి గాలులు దిగువ ట్రోపో ఆవరణములో వీస్తుండడం వల్ల వర్షపాతం అనేక ప్రాంతాల నుంచి మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. దాంతో పాటు ఆకాశం నిరంతరంగా మేఘాలు పట్టి ఉండడం వల్ల నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు, అండమాన్ నికోబార్ దీవుల్లో ఎక్కువ భాగం, అండమాన్ సముద్రంలో మే 16న విస్తరించాయి. నైరుతి రుతుపవనాల పయనం 5 డిగ్రీల ఉత్తర అక్షాంశం/80 డిగ్రీల తూర్పు రేఖాంశం, 8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/85 డిగ్రీల తూర్పు రేఖాంశం, 11 డిగ్రీల ఉత్తర అక్షాంశం/90 డిగ్రీల తూర్పు రేఖాంశం, లాంగ్ ఐలాండ్స్, 14.8 డిగ్రీల ఉత్తర అక్షాంశం/97.5 డిగ్రీల తూర్పు రేఖాంశం వరకూ విస్తరించాయి.
రాబోయే 2 రోజుల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ బంగాళాఖాతం, మొత్తం అండమాన్ సముద్రం, అండమాన్ దీవులకు, తూర్పు మధ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలకు, మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.
నిన్న ఉత్తర ఛత్తీస్ గఢ్, విదర్భ మీదుగా బిహార్ నుంచి దక్షిణ తమిళనాడు వరకూ ఉన్న ఉత్తర - దక్షిణ ద్రోణి ఈ రోజు ఈశాన్య మధ్యప్రదేశ్ నుంచి ఉత్తర తమిళనాడు వరకూ విదర్భ మధ్య కర్ణాటక మీదుగా సగటు సముద్ర మట్టానికి 0.9 కిలో మీటర్ల ఎత్తులో ఉంది. నైరుతి బంగాళాఖాతం, ఉత్తర తమిళనాడు తీర ప్రాంతాల్లో ఉపరితల ద్రోణి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలో మీటర్ల నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది.
Telangana Weather: ఇక హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలో మే 17న అక్కడకక్కడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కొన్ని జిల్లాల్లో వచ్చే అవకాశం ఉంది. గాలులు కూడా గంటకు 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది.
‘‘హైదరాబాద్‌లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 38 డిగ్రీల సెంటీ గ్రేడ్ నుంచి 26 డిగ్రీల సెంటీ గ్రేడ్ వరకూ ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ ఉపరితల గాలులు గంటకు 8 నుంచి 12 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంటుంది.’’ హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు ట్వీట్ చేశారు.
‘‘ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, జగిత్యాల, జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, మహబూబాబాద్, ఖమ్మం, కొమురం భీం, మహబూబ్ నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్ గిరి, ములుగు, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి తదితర జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంటుంది.