Weather Latest News: ఏపీ, తెలంగాణలో ఇప్పటికే కురుస్తున్న వర్షాలు మరో రెండు రోజులు కొనసాగనున్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. వచ్చే రెండు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడనున్నట్లుగా భారత వాతావరణ విభాగం అధికారులు అంచనా వేశారు.
ప్రస్తుత వాతావరణ పరిస్థితి
మంగళవారం (జూలై 12) బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం దక్షిణ ఒడిశా తీరంలో కేంద్రీకృతమై ఉంది. దీనిపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించిన ఉపరితల ఆవర్తనం నైరుతి వైపునకు ఒంగి ఉంది.
దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఉత్తర కోస్తాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో కొన్నిచోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. ఉత్తర కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు పడతాయని పేర్కొన్నారు. నిన్న కాకినాడ, అల్లూరి జిల్లాల్లో భారీ వర్షాలు, నెల్లూరు, కర్నూలు, చిత్తూరు, శ్రీసత్యసాయి జిల్లాల్లో ఓ మోస్తరు వానలు పడ్డాయి.
Also Read: Kukatpally Theft: హైదరాబాద్‌లో కొత్త గ్యాంగ్ హల్‌చల్ - ఇలాంటివారిని పనిలో పెట్టుకుంటే ఇల్లు గుల్లే!
రుతుపవన కరెంట్ బలంగా ఉండడంతో సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయని, ఈనెల 16 వరకు కోస్తాలో మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం వార్నింగ్ ఇచ్చింది. ఇక శుక్రవారం (జూలై 15) నుంచి రెండు మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు తగ్గుతాయని అధికారులు తెలిపారు. దీంతో వారం నుంచి ఆగకుండా ముసురుపట్టి కురుస్తున్న వర్షాలు కాస్త విరామం ఇవ్వనున్నాయి. అయితే, రేపు (జూన్ 14) సాయంత్రం నుంచి వర్షాలు చాలా వరకూ తగ్గుతాయని, తెలంగాణలో కూడా ఇదే పరిస్థితి ఉంటుందని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు.
Telangana Weather: తెలంగాణలో ఇలా
దీని ప్రభావంతో గురు, శుక్రవారాల్లో (జూలై 14, 15 తేదీలు) తెలంగాణలో వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రికొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, జనగాం జిల్లాలకు హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం రెడ్ అలెర్ట్ ప్రకటించింది. బుధవారం ఆసిఫాబాద్ జిల్లా జైనూరు మండలంలో రాష్ట్రంలో కెల్లా రికార్డు స్థాయిలో 39.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా సగటున 6.48 సెంటీమీటర్ల వర్షం పడిందని అంచనా వేశారు. బుధవారం తరహాలోనే తెలంగాణలో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంటుందని అంచనా వేశారు.
Also Read: CM KCR Phone: ప్రశాంత్‌రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్- మంత్రి ఏం చెప్పారంటే?