తెలంగాణ రాష్ట్రం మీదుగా ప్రస్తుతం దిగువ స్థాయిలో గాలులు ఆగ్నేయ దిశ నుండి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్‌లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో తదుపరి మూడు రోజులు పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంది. రాబోయే మూడు రోజుల్లో రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు  సాధారణం కంటే 2 నుండి 4 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు పెరిగే అవకాశం ఉంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతూ రేపటి నుండి  40 డిగ్రీల సెంటీగ్రేడ్ పైన రాష్ట్రంలో అనేక చోట్ల నమోదు అయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.


హైదరాబాద్ లో ఇలా
‘‘హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘాలు పట్టి ఉంటుంది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రి సమయంలో ఉరుములతో కూడిన మేఘాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 37 డిగ్రీలు, 23 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఆగ్నేయ దిశ నుంచి గాలులు గంటకు 4 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 36 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 22.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 42 శాతం నమోదైంది.


ఏపీలో వర్షాలు ఇలా
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (Andhra Pradesh State Disaster Management Authority-APSDMA) మంగళవారం 32 మండలాల్లో వేడిగాలులు వీస్తాయని హెచ్చరించింది. ముఖ్యంగా అనకాపల్లి, అల్లూరి, మన్యం, తూర్పుగోదావరి, ఏలూరు, కాకినాడ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 


అల్లూరి సీతారామరాజు జిల్లా ఏడు మండలాల్లో విపరీతమైన వేడిగాలులు వీస్తాయని, ఉష్ణోగ్రత కనిష్టంగా 44 డిగ్రీల సెల్సియస్‌ను తాకుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అనకాపల్లి జిల్లాలోని ఐదు మండలాలు, తూర్పుగోదావరిలోని రెండు మండలాలు, కాకినాడలోని ఆరు మండలాలు, పార్వతీపురం జిల్లాలోని ఆరు మండలాల్లో కూడా వడగాలులు వీస్తాయని అప్రమత్తం చేశారు.


ఈ ఏడాది ఎల్ నినో పరిస్థితులు - ఐఎండీ
 ఈ ఏడాది వ‌ర్షాకాలం సాధార‌ణంగా ఉండ‌నుందని, నైరుతీ రుతుప‌వ‌నాల వ‌ల్ల వ‌ర్షాలు సాధార‌ణంగా ఉంటాయ‌ని మంగళవారం భార‌తీయ వాతావ‌ర‌ణ శాఖ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ డాక్టర్ మృత్యుంజ‌య మ‌హాపాత్ర తెలిపారు. వ‌ర్షాకాలం మ‌ధ్యలో ఎల్ నినో ప‌రిస్థితులు ఉత్పన్నం అయ్యే అవ‌కాశాలు ఉన్నాయ‌ని, దాని వ‌ల్ల రుతుప‌వ‌నాల‌పై ప్రభావం ప‌డుతుంద‌ని, సీజ‌న్ రెండో భాగంలో వ‌ర్షాలు త‌క్కువ‌గా కురిసే అవ‌కాశాలు ఉన్నట్లు ఐఎండీ డైరెక్టర్ జ‌న‌ర‌ల్ తెలిపారు. 2023లో జూన్ నుంచి సెప్టెంబ‌ర్ వ‌ర‌కు 96 శాతం వ‌ర్షపాతం ఉంటుంద‌ని ఐఎండీ చెప్పింది. జూలైలో ఎల్ నినో ప‌రిస్థితులు పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి.


ఎల్ నినో వ‌ల్ల ప‌సిఫిక్‌ స‌ముద్ర ఉప‌రిత‌లం వేడిగా మారుతుంది. దీని వ‌ల్ల ప్రపంచ‌వ్యాప్తంగా వాతావ‌ర‌ణాల్లో మార్పు సంభ‌విస్తుంది. ఇండియాపై కూడా ఈ ప్రభావం ఉంటుంది. ఒక‌వేళ నైరుతి రుతుప‌వ‌నాల స‌మ‌యంలో ఎల్‌నినో ఉంటే, అప్పుడు వ‌ర్షాలపై ప్రభావం ప‌డే అవకాశం ఉంది. దీని వ‌ల్ల రైతుల‌కు మ‌రిన్ని క‌ష్టాలు ఉంటాయి. ఎల్‌నినో వ‌ల్ల సాధార‌ణంగా భారత్ లో వ‌ర్షపాతం త‌క్కువ‌గా న‌మోదు అవుతుంది. దీంతో క‌రవు ప‌రిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉంటుంది.