నేడు తెలంగాణలో కొన్ని జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ అలర్ట్ జారీ చేసింది. ఇక గత కొద్ది రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో పొడి వాతావరణం ఉంటుండగా, అదే కొనసాగుతుందని రెండు రాష్ట్రాల వాతావరణ కేంద్రాల అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పోల్చుకుంటే తెలంగాణలో చలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండబోతుంది.
కొద్ది రోజులుగా తెలంగాణలో చలి సాధారణంగా ఉండగా, ఇప్పుడు కాస్త పెరిగింది. రాష్ట్రంలో తెలంగాణలోని 7 జిల్లాలకు హైదరాబాద్ వాతావరణ విభాగం ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఐదు రోజుల క్రితం (ఫిబ్రవరి 5) ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ అయిన సంగతి తెలిసిందే. సాధారణంగా 5 నుంచి 10 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందనిపిస్తే వాతావరణ విభాగం ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. 11 నుంచి 15 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం ఉంటే ఎల్లో అలెర్ట్ జారీ చేస్తుంటారు. రాబోయే ఐదు రోజులకు సంబంధించి తెలంగాణ వాతావరణ విభాగం నమోదు కానున్న ఉష్ణోగ్రతల అంచనాలను వెదర్ బులెటిన్‌లో వివరించింది.
ఎల్లో అలర్ట్ ఈ 7 జిల్లాల్లో
ఆదిలాబాద్, కుమ్రుం భీమ్, మంచిర్యాల, నిర్మల్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేశారు. రేపు, ఎల్లుండి నుంచి క్రమంగా చలి తగ్గిపోతుందని వెదర్ బులెటిన్ లో వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఎలాంటి వర్ష సూచన లేదు.
ఇక ఆదిలాబాద్ లో గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు అయింది. 34.3 డిగ్రీలు నమోదైనట్టు వాతావరణ విభాగం తెలిపింది. అత్యల్ప ఉష్ణోగ్రత కూడా అక్కడే 13.2 డిగ్రీలు ఆదిలాబాద్‌లో నమోదైంది. ఇవాళ అత్యధిక ఉష్ణోగ్రత 30 డిగ్రీల కన్నా ఎక్కువగా ఉంటుందని, అత్యల్పం 15 డిగ్రీలుగా ఉంటుందని అంచనా అధికారులు వేసింది.
‘‘ఆకాశం పాక్షికంగా మేఘాలుపట్టి ఉంటుంది. నగరంలో పొగ మంచు ఉదయం సమయంలో ఏర్పడుతుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 34 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. తూర్పు దిశ నుంచి గాలులు గాలి వేగం గంటకు 3 నుంచి 6 కిలో మీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది’’ అని వెదర్ బులెటిన్ లో పేర్కొ్న్నారు. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 34.2 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19 డిగ్రీలుగా నమోదైంది.
ఏపీలో ఇలా
ఆంధ్రప్రదేశ్ వాతావరణ విభాగం తెలిపిన వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్, యానాం ప్రాంతాల్లో దిగువ ట్రోపోస్ఫిరిక్ స్థాయిల్లో ఈశాన్య, తూర్పు దిశలలో గాలులు వీస్తున్నాయని వెదర్ బులెటిన్ లో పేర్కొన్నారు.
ఈ వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీలోని ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటనలో తెలిపింది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో కూడా పొడి వాతావరణమే ఉండనుంది. రాయలసీమలో వచ్చే మూడు రోజులు పొడి వాతావరణమే ఉండనుంది.
ఇక క్రమంగా ఎండాకాలం
‘‘రాష్ట్రంలో వాతావరణం మళ్లీ మారనుంది. ఇక మెల్లగా చలి కాలం నుంచి ఎండా కాలానికి మారనుంది. సాధారణంగా ఫిబ్రవరి మొదటి రెండు వారాల్లో అంతగా ఎండ ఉండదు, కానీ ఈ సారి మాత్రం వేసవి కాలం కాస్త ముందుగా, మరింత జోరుగా మొదలవ్వనుంది. మరో ఐదు రోజుల వ్యవధిలో ఉష్ణోగ్రతలు 4-5 డిగ్రీలు రాష్ట్ర వ్యాప్తంగా పెరగనుంది. అనంతపురం నుంచి నెల్లూరు మధ్యలో, నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు ఉష్ణోగ్రతలు ఒక సారిగా వేడికానుంది. ఇప్పుడే 40 డిగ్రీలు రావు కానీ 37 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో నమోదవ్వనుంది. ముఖ్యంగా విజయవాడ - గుంటూరు ప్రాంతం, అలాగే నంధ్యాల జిల్లాలో రాష్ట్రంలోని మిగిలిన భాగాలకంటే వేడిగా ఉండనుంది. మరోవైపున చలి కూడా ఉంటుంది. రాత్రి వేళల్లో చల్లగా ఉండే వాతావరణం ఉంటుంది.’’ అని ఏపీ వెదర్ మ్యాన్ తెలిపారు.