Petrol Bunk Owner Innovative Idea Due To Heavy Temparature In Karimnagar: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఎండలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల అదనపు ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల తీవ్ర వడగాల్పులతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పగటి పూట బయటకు రావాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. అత్యవసరమైతేనే బయటకు రావాలన్న వాతావరణ శాఖ సూచనలతో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఎండల నుంచి ఉపశమనం పొందేందుకు పలువురు వినూత్న ఆలోచనలు చేస్తున్నారు. కరీంనగర్ (Karimnagar) పట్టణంలోని ఓ పెట్రోల్ బంక్ యజమాని ఎండ తీవ్రత నుంచి కాస్త ఉపశమనం పొందేలా బంక్ చుట్టూ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.


వాటర్ స్ప్రింక్లర్స్


పెట్రోల్ బంక్ వద్ద సాధారణం కంటే ఎక్కువగానే ఉష్ణోగ్రత ఉంటుంది. ఈ క్రమంలో ఎండ వేడిమి నుంచి ఉపశమనం పొందేలా కరీంనగర్ లోని జ్యోతినగర్ భారత్ పెట్రోల్ బంక్ యజమాని వాహనదారులు సేద తీరేలా ఏర్పాట్లు చేశాడు. పెట్రోల్ బంక్ చుట్టూ వాటర్ స్ప్రింక్లర్స్ ఏర్పాటు చేయగా.. అవి నలుమూలలా వాటర్ చిమ్ముతూ బంక్ పరిసర ప్రాంతాలు చల్లగా ఉంచుతున్నాయి. ఈ క్రమంలో ఇంధనం పోయించుకునేందుకు వచ్చిన వాహనదారులు ఎండ వేడి నుంచి కాస్త సేద తీరుతున్నారు. కాగా, రోజుకు వెయ్యి లీటర్ల వరకూ నీటిని స్ప్రింక్లర్ల కోసం వాడుతున్నట్లు బంక్ యజమాని తెలిపారు.


Also Read: Mancherial: ఆ బ్రాండ్‌ బీర్ల కోసం పోరాటం, యువకుడి విజయంతో మందుబాబుల సన్మానం