Tummala Nageshwar Rao Comments: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రైతు బంధు నిధులు సకాలంలో జమ చేయడం లేదనే విమర్శలను ఎదుర్కొంటోంది. చాలా చోట్ల పవర్ కట్‌లతో పాటు, సాగునీరు, తాగు నీటి సరఫరా విషయంలోనూ బీఆర్ఎస్ నేతలు అధికార పార్టీని తప్పుబడుతున్నారు. రైతుబంధు అడిగితే చెప్పుల‌తో కొడతామ‌ని రైతుల‌ను బెదిరించారంటూ బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే, తాజాగా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. దీనిపై కేసీఆర్ ఎక్స్ ద్వారా స్పందించి కౌంటర్ ఇచ్చారు.


తెలంగాణ వ్యవసాయ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రైతు బంధు త‌న‌కే ఇంకా రాలేదు అని మాట్లాడారు. ఆయన పక్కనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. నాకే ఇంకా రైతు బంధు రాలేదు.. అని భట్టి విక్రమార్కను తుమ్మల అడిగారు. ‘‘నా రైతు బంధు ఇంకా కొద్దిగా రావాల్సి ఉంది.. ఇవ్వమంటే.. జీతాలు వచ్చినాక ఇస్తామన్నాడు పెద్దాయన’’ అని తుమ్మల నాగేశ్వర్ రావు అన్నారు.


మంత్రి చేసిన ఈ వ్యాఖ్యలతో విపక్షం బీఆర్ఎస్ నేతలకు అవకాశం దొరికినట్లు అయింది. వారు ఇన్నాళ్లు రైతు బంధు, నీళ్లు, కరెంటు, పంట ధాన్యాన్ని సక్రమంగా మేనేజ్ చేయడం లేదనే విమర్శిస్తున్నాయి. తాజాగా మంత్రి నోటి నుంచే రైతు బంధు అందలేదని చెప్పడంతో ఇక బీఆర్ఎస్ నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. మంత్రి తుమ్మ‌ల వ్యాఖ్య‌ల‌పై బీఆర్ఎస్ అధినేత‌ కేసీఆర్ ఎక్స్ ద్వారా స్పందించారు. రైతుబంధు ఇవ్వ‌కుండా తెలంగాణ రైతుల‌కు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ద్రోహం చేసింద‌ని అన్నారు. ఆ రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర్ రావు వ్యాఖ్య‌ల‌తో అది స్ప‌ష్ట‌మ‌వుతోంద‌ని.. తాము ఇదే విషయాన్ని ఇన్ని రోజులుగా చెబుతున్నామని కేసీఆర్ పోస్ట్ చేశారు.