Sahithi Dasari Election Symbol: ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. భానుడు భగ భగ మండుతున్నప్పటికీ, అభ్యర్థులు జోరుగా ప్రచారం కొనసాగిస్తున్నారు. ఊరూ వాడా తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. తెలంగాణతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లోనూ పలువురు సినీ తారలు ఎన్నికల బరిలో నిలిచారు. అసెంబ్లీతో పాటు పార్లమెంట్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్, నటసింహం నందమూరి బాలకృష్ణ, నటి రోజా ఎన్నికల సంగ్రామంలోకి దిగారు. ఈ ముగ్గురు అసెంబ్లీ అభ్యర్థులుగా పోటీకి దిగారు. ఇక తెలంగాణలోనూ ఓ సినీ నటి లోక్ సభ ఎన్నికల బరిలో నిలిచింది. ఆమె మరెరో కాదు నటి సాహితీ దాసరి.


చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో సాహితీ దాసరి


‘మా ఊరి పొలిమెర’, ‘పొలిమెర 2’ సినిమాల్లో కీలక పాత్ర పోషించింది సాహితీ దాసరి. ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగింది. ఇండిపెండెంట్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసింది. ఆమె నామినేషన్ ను ఎన్నికల అధికారులు యాక్సెప్ట్ చేశారు. 29 ఏండ్ల సాహితీకి గాజు గ్లాస్ గుర్తును కేటాయించారు. ఈ విషయాన్ని సాహితి సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. తనకు ఈసీ గాజు గ్లాస్ కేటాయించినట్లు వెల్లడించింది. అందరూ తనకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేసింది. అయితే, గాజు గ్లాస్ సింబల్ ను చూసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆమె జనసేన నుంచి బరిలోకి దిగుతున్నారా? అని అపోహపడుతున్నారు. అయితే, తాను ఇండిపెండెంట్ అభ్యర్థిగానే బరిలోకి దిగినట్లు తెలిపింది సాహితీ. ఈ గాజు గ్లాస్ గుర్తు ఆమెకు కలిసి వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన కార్యకర్తలు కూడా తనకు ఓటు వేసే ఛాన్స్ ఉందంటున్నారు.






చేవెళ్లలో గట్టి పోటీ తప్పదా?


చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలో ఆయా పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉన్నారు. బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వర్ రెడ్డి పోటీలో ఉండగా, కాంగ్రెస్ నుంచి రంజిత్ రెడ్డి బరిలోకి దిగారు. బీఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పోటీకి దిగారు. వీరితో సాహితీ దాసరి పోటీ పడటం విశేషం. అత్యంత బలమైన అభ్యర్థుల మధ్య ఆమెకు ఎన్ని ఓట్లు పడే అవకాశం ఉంది? అనేది ఆసక్తికరంగా మారింది.



సాహితీ ఏయే సినిమాల్లో నటించిందంటే?


తొలుత షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నది సాహితీ దాసరి. అనంతరం ప్రదీప్ ‘పెళ్లి చూపులు’ షోతో బాగా క్రేజ్ సంపాదించుకుంది. ఆ తర్వాత నెమ్మదిగా సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. 'మా ఊరి పొలిమేర', 'పొలిమేర 2', 'ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్', 'సర్కారు నౌకరి', 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' సినిమాల్లో నటించింది. ప్రస్తుతం ‘కంచు కనకమాలక్ష్మి’ సహా పలు సినిమాల్లో నటిస్తోంది.  


Read Also: ‘హరిహర వీరమల్లు’ నుంచి అదిరిపోయే అప్ డేట్, టీజర్ రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన మేకర్స్!