YS Sharmila On BRS: ప్రశాంత వాతావరణంలో జరుగుతున్న వైఎస్ఆర్టీపీ ప్రజాప్రస్థాన యాత్రలో బీఆర్ఎస్ నేతలు అలజడి సృష్టిస్తున్నారని ఆ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆరోపిస్తున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం జమలపురంలో ఆమె మీడియాతో మాట్లాడారు. పర్వతగిరి మండలం తురకల సోమారం వద్ద బీర్ ఎస్ పార్టీ నేతలు ప్లెక్సీలు చించి వేయడం హేయమైన చర్య అన్నారు. నిన్న తురకల సోమారం వద్ద జరిగిన ఘటనలో బీఆర్ఎస్ నేతలను పోలీసులు భేషరతుగా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా సాగుతున్న ప్రజాప్రస్థాన యాత్రలో బీఆర్ఎస్ నేతలు అలజడి సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న తనను అడ్డుకునే కుట్ర జరుగుతోందన్న షర్మిల మీడియాలో వచ్చిన వార్తల ఆదరంగానే నేను మంత్రి ఎర్రబెల్లి, స్థానిక ఎమ్మెల్యే అరూరి రమేష్ ను విమర్శించానని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నేతలు చేసిన అవినీతిపై ప్రశ్నిస్తే యాత్రను అడ్డుకునేందుకు యత్నిస్తున్నారన్నారు. 


తమ పాదయాత్రపై మళ్లీ దాడులు చేస్తున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. పర్వతగిరిలో మళ్లీ సీన్ రిపీట్ చేయాలని చూశారని ఆమె చెప్పుకొచ్చారు. తమ పాదయాత్ర కవరేజీకి వచ్చిన మీడియాపై కూడా దాడులకు దిగారని అన్నారు. ప్రజల పక్షాన నిలబడటం తాము చేసినా తప్పా అని ప్రశ్నించారు. ప్రజల సమస్యలు ఎత్తి చూపడమే తాము చేసిన తప్పా అంటూ బీఆర్ఎస్ సర్కారును నిలదీశారు. ప్రజాప్రస్థాన యాత్రలో తాము చేస్తున్నది ప్రజల పక్షాన నిలబడం మాత్రమేనని వివరించారు. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నట్లు వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలపై మోసం ఎందుకు చేశారు అని నిలదీస్తున్నట్లు వైఎస్ షర్మిల వెల్లడించారు. కేసీఆర్ మోసాలు చెప్పుకుంటూ పోతే తెల్లారితుందని ఎద్దేవా చేశారు. 


వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ మీద తాము చేసిన ఆరోపణలు ప్రజలు చెప్పినవేని ఆమె వివరించారు. ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఏ1 కాంట్రాక్టర్ అయ్యాడు అని చెప్పింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే భూములు ఇవ్వక పోతే థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తాడు అనేది వాస్తవం కాదా అని నిలదీశారు. స్వయంగా మందకృష్ణ మాదిగ భూములు కూడా కబ్జా చేయబోయాడు అనేది నిజం కాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ కౌన్సిలర్లు ఈయన అవినీతిపై నిరసన చేశారు అనేది పచ్చి నిజం అని చెప్పుకొచ్చారు. తాము ఆరోపణలు చేస్తుంటే.. నాయకులు తప్పు చేయకపోయుంటే బుజాలు ఎందుకు తడుముకుంటున్నారని అడిగారు. మీకు కూడా వాటాలు ఉన్నాయి కాబట్టి ఇంతలా భయపడుతున్నారంటూ వ్యాఖ్యానించారు. ప్రజల పక్షాన నిలబడాలనే సోయి ఉందా లేదా ఈ ఎమ్మెల్యేలు, మంత్రులకు అంటూ విమర్శించారు.


ప్రజల కోసం పని చేస్తున్న ఎమ్మెల్యే లు బీఆర్ఎస్ లో ఎవరూ లేరని వైఎస్ షర్మిల ఖరాకండిగా చెప్పారు. ఎంత వెతికి చూసినా ప్రజల కోసం పని చేసే ఎమ్మెల్యే దొరకరని ఎద్దేవా చేశారు. మంత్రి ఎర్రబెల్లి సొంత ఊరని.. అందుకే ఆయనను నిలదీశామన్నారు. పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా సర్పంచ్ ల పక్షాన ఏ రోజు నిలబడ్డారు మంత్రే చెప్పాలి అని అన్నారు. నిధులు ఇవ్వక సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గుర్తు చేశారు. నిధులు ఇవ్వక పోగా ఫైనాన్స్ కమీషన్లు ఇచ్చిన నిధులు కూడా పక్క దారి పట్టించారని ఫైర్ అయ్యారు. నిధులు ఇవ్వరు... పనులు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని ఆమె వివరించారు. బయట అప్పులు తెచ్చి, మంగళ సూత్రాలు తాకట్టు పెట్టీ సర్పంచులు పనులు చేయిస్తున్నారని చెప్పుకొచ్చారు. నిధులు సమకూరక, అప్పులు కట్టలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే మంత్రి సర్పంచుల పక్షాన ఏనాడైనా నిలబడ్డాడా అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. దాడులకు తాను భయపడను.. ప్రజల పక్షాన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటానని తెలిపారు. తాను చేసిన ఆరోపణల్లో తప్పుంటే తనను ప్రత్యక్షంగా అడగొచ్చని షర్మిల స్పష్టం చేశారు.


"పంచాయతీలు నడపాలి అంటే బీరు సీసాలు అమ్ముకోవాలని చెప్పలేదా? 8 ఏళ్లుగా ప్రతిపక్షాలు నిలదీయలేదు. అందరూ అమ్ముడు పోయారు. మీడియా, ప్రజలు ఏమైనా మాట్లాడితే దాడులు..కేసులు. ఇవాళ వైఎస్ఆర్టీపీ మీ అక్రమాలు ఎత్తి చూపిస్తే తట్టుకోలేక పోయారు. ఇంతకాలం మీ ఆటలు సాగాయి. ఇక మీద సాగవు. మీకు దమ్ముంటే మంచి పాలన అందించండి. మీ పథకాలపై డిస్కషన్ పెట్టండి. పాలన చేతకాక..మాపై దాడులు చేస్తారా..? మళ్ళీ ఒకసారి మీకు ఓపెన్ ఛాలెంజ్. మీ దాడులకు భయపడేది కాదు వైఎస్సార్ బిడ్డ. మీరు కాదు మీకంటే జేజమ్మలను చూసినా దాన్ని నేను. మీ బెదిరింపులకు భయపడేది లేదు. మళ్ళీ చెప్తున్నాం..మేము చేసిన ఆరోపణల్లో తప్పులు ఉంటే పబ్లిక్ ఫోరం పెట్టండి. మీడియాను పిలుద్ధాం..ప్రతిపక్షాలను పిలుద్దాం. మీరు సంజాయిషీ చెప్పండి. మీ అక్రమాలను మేము ప్రశ్నిస్తం. అధికారం ఉంది కదా..పోలీసులు ఉన్నారు కదా అని దాడులు చేస్తే ఊరుకోం. మా జోలికి వస్త‌ే ఇంకా గట్టిగా మాట్లాడుతం. పోలీస్ వాళ్ళను హెచ్చరిస్తున్నం... ఇంకా కేసు తీసుకోలేదు. మాపై దాడులు చేస్తున్నట్లు ఆధారాలు కూడా ఉన్నాయి.. చర్యలు తీసుకోండి. బీఆరఎస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొండి. సచివాలయం ప్రమాదంపై అఖిలపక్షం చూడటానికి అనుమతి ఇవ్వండి. ప్రభుత్వం కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. నిజాలు బయటకు రావాలి." - వైఎస్ షర్మిల, వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు