Mulugu Accident: ములుగు జిల్లా తాడ్వాయి మండలం నార్లపూర్ గ్రామంలో ఆటో అతివేగంగా వచ్చి అదుపుతప్పి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన ఘటనలో మహిళ స్పాట్లోనే మృతి చెందింది. 16 మందికి తీవ్ర గాయాలు కాగా నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గోవిందరావుపేట మండలం మొద్దుల గూడెం గ్రామానికి చెందిన 17 మంది కూలీలను పాసెంజర్ టీఎస్28టీ 2286 నంబర్ గల ఆటోలో తాడ్వాయి మండలం మేడారం సమీపంలో నాట్లు వేయడానికి ఓ డ్రైవర్ కూలీలను తీసుకెళ్తున్నాడు. అయితే డ్రైవర్ ఆటోను అతి వేగంతో నడుపుతున్నాడు. ఈ క్రమంలోనే నార్లాపూర్ సమీపంలోకి రాగానే పీహెచ్సీ వద్ద గల మూల మలుపులో ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లెబోయిన సునీత(38) అక్కడికక్కడే చనిపోయింది. మరో 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడగా జ్యోతి, బోగమ్మ, విజయ, లలిత పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మేడారం విధుల్లో ఉన్న సీఐ రవీందర్, ఎస్సై వెంకటేశ్వర్లు క్షతగాత్రులను పోలీసు వాహనాల్లోనే ఆసుపత్రికి తరలించారు. అయితే ఆటో డ్రైవర్ మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు భావిస్తున్నారు.
పది రోజుల క్రితం భద్రాద్రిలో ప్రమాదం - నలుగురి మృతి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోటిలింగాల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఇల్లెందు-మహబూబాబాద్ మధ్య కోటిలింగాల వద్ద కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతిచెందారు. మరొకరికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ప్రమాదంలో కారు ముందుభాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. యాక్సిడెంట్ పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయ చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించారు. కారు డ్రైవర్ తో సహా ముగ్గురు ప్రమాదస్థలిలోనే మృతిచెందారని పోలీసులు తెలిపారు. మరొకరు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా మరణించారని చెప్పారు. మృతులను హనుమకొండ జిల్లా కమలాపూర్‌కు చెందిన అరవింద్, వరంగల్‌కు చెందిన రాము, కల్యాణ్, శివ అని పోలీసులు గుర్తించారు. గాయపడిన వ్యక్తిని నర్సంపేటకు చెందిన రణధీర్ గా తెలుస్తోంది. ఈ రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే వీళ్లంతా ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం భద్రాద్రి జిల్లా మోతె ప్రాంతానికి వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
ప్రీ వెడ్డింగ్ షూట్ లోకేషన్ల కోసం వెళ్తూ
మహబూబాబాద్ వైపు నుంచి ఇల్లెందు వెళ్తోన్న టీఎస్03ఎఫ్ సీ 9075 గల కారును, ఇల్లెందు నుంచి మహబూబాబాద్ వైపు వెళ్తున్న ఏపీ16టీజీ 3859 నెంబర్ గల లారీ వేగంగా ఢీకొట్టింది. దీంతో కారులో ఉన్న ఐదుగురు యువకుల్లో ముగ్గురు ఘటనాస్థలిలోనే మృతి చెందారు. గాయపడిన మరో ఇద్దరిని ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, ఒకరు మార్గమధ్యలో మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు వరంగల్ జిల్లా కేంద్రం బట్టలబజారుకు చెందిన ఫొటోస్టూడియో యజమాని బైరి రాము, వరంగల్ నగరానికి చెందిన బాసబత్తిని అరవింద్‌గా పోలీసులు గుర్తించారు. మరో ఇద్దరు కూడా వరంగల్ జిల్లాకు చెందిన రిషీ, కళ్యాణ్‌గా తెలుస్తోంది. వీళ్లంతా భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలోని ఫొటో షూట్‌కు లోకేషన్ల గుర్తించడానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరిగింది.