Show Cause Notice Sharmila: వరంగల్ : చెన్నారావు పేట మండలం లింగగిరి క్రాస్ నుండి రుక్మా తండా వరకు వైఎస్ షర్మిల ఆదివారం ప్రజా ప్రస్థానం పాదయాత్రను ప్రారంభించాల్సి ఉంది. కానీ ఈ క్రమంలో వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలికి వరంగల్ పోలీసులు షాకిచ్చారు. రేపటి నుంచి పాదయాత్రను పునః ప్రారంభించేందుకు పోలీసుల అనుమతి కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును పరిశీలించిన వరంగల్ పోలీసులు పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదు. మీ పాదయాత్రకు అనుమతి ఎందుకు నిరాకరించవద్దో చెప్పాలంటూ వరంగల్ పోలీసులు వైఎస్ షర్మిలకు షోకాజ్ నోటీసులను అందజేశారు. పాదయాత్రకు మొదటిసారి పోలీసులు అనుమతిని ఇచ్చినప్పుడు వారు సూచించిన నియమ నిబంధనలను అతిక్రమించి వైఎస్ షర్మిల వ్యక్తిగత దూషణకు పాల్పడటం ద్వారా శాంతి భద్రతలకు విఘాతం కలిగించారని.. దానికి సంబంధించిన అధారాలను జతచేస్తూ ప్రస్తుతం పాదయాత్ర అనుమతి కొసం చేసుకున్న దరఖాస్తును ఎందుకు నిరాకరించవద్దో కారణాలను తెలియజేయాలని పోలీసులు షర్మిలకు షోకాజ్ నోటీసులు అందజేశారు.
పాదయాత్రకు బ్రేక్
వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రజా ప్రస్థానం పాదయాత్ర ఆదివారం నుంచి 10 రోజుల పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో సాగేలా పార్టీ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం లింగగిరి గ్రామం వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళులు అర్పించి పాదయాత్ర ప్రారంభించేలా రూట్ మ్యాప్ సైతం సిద్ధం అయింది. అయితే కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అనుమతి ఇవ్వాల్సిన వరంగల్ పోలీసులు చివరి నిమిషం వరకు ఎదురుచూసే ధోరణిగా వ్యవహరించి పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వాలో చెప్పాలి అంటూ షోకాజ్ నోటీస్ లు జారీ చేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించినట్లు కారణం చూపించే ప్రయత్నం చేశారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ సాగుతున్న పాదయాత్రను అడ్డుకొనే ప్రయత్నం టీఆర్ఎస్ పార్టీ చేస్తే.. YSR తెలంగాణ పార్టీ నిబంధనలను ఉల్లంఘించిందని పోలీసులు నాటకం ఆడుతున్నారని వైఎస్సార్టీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. పాదయాత్రను అడ్డుకొనే విధంగా కుట్రలు జరుగుతున్నాయని మండిపడుతున్నారు. ఈ అంశంపై YSR తెలంగాణ పార్టీ న్యాయపరంగా నోటీసులకు వివరణ ఇవ్వడంతో పాటు కోర్టు ఆదేశాలను గౌరవిస్తూ ఇవాళ ఒక్క రోజు పాదయాత్రకు విరామం ఇచ్చినట్లు ప్రకటించింది. వరంగల్ పోలీసులకు న్యాయబద్ధంగా వివరణ ఇస్తామని..అప్పటికీ అనుమతి ఇవ్వకపోతే న్యాయస్థానం ద్వారా పోరాటం చేస్తామని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పాదయాత్రను అడ్డుకొనేలా అధికార పార్టీ చేస్తున్న ప్రయత్నాలకు తిప్పి కొడతామని అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు
తెలంగాణ మలిదశ ఉద్యమంలో తొలి అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ లోని గన్ పార్క్ వద్ద నివాళి అర్పించారు షర్మిల. అన్యాయానికి గురవుతున్న అమరవీరుల కుటుంబాలకు,ఉద్యమకారులకు YSRTP అండగా ఉంటుందని, అధికారంలోకి వచ్చాక వారికి ఉచిత ఇండ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తాం అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అమరవీరులకు, ఉద్యమకారులకు తీరని ద్రోహం చేశారు. 1200మంది ఆత్మబలిదానం చేసుకుంటే కొంతమందినే గుర్తించారు. నీళ్లు, నిధులు, నియామకాలకు తూట్లు పొడిచి, సొంత ఆస్తులు కూడబెట్టుకున్నారు. కుటుంబానికి, ఉద్యమద్రోహులకు పదవులు కట్టబెట్టి రాష్ట్రాన్ని అప్పులమయం చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు.