Kaloji Kala Kshethram: కాళోజీ కళాక్షేత్ర పనుల్లో వేగం పెంచి తెలంగాణ అవతరణ దినోత్సవం అయిన జూన్ 2వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ భాస్కర్ ఆదేశించారు. హన్మకొండలో కొనసాగుతున్న కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, కుడా వైస్ చైర్మన్, బల్దియా కమిషనర్ ప్రావీణ్య, కుడా చైర్మన్ సుందర్ యాదవులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ... అనేక చారితాత్మక కట్టడాలు నగరంలో ఉన్నాయని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత  వాటి అభివృద్ధికి సీఎం కేసీఆర్ మరింత కష్టపడుతున్నారని తెలిపారు. 


కళాకారులకు నిలయంగా ఈ క్షేత్రం పని చేస్తుంది..


కళలకు నిలయమైన ఈ నగరంలో ముఖ్యమంత్రి కేసీఆర్.. కాళోజీ పుట్టిన గడ్డమీదనే ఆయన కళాక్షేత్రం నిర్మించేందుకు ముందుకొచ్చారు. రాష్ట్రం ఏర్పడ్డ 100 రోజుల్లోనే నగరానికి వచ్చి హామీ ఇచ్చి.. నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ క్రమంలోనే ప్రముఖ కాంట్రాక్టర్ చేత నిర్మాణ పనులు చేయిస్తున్నామనిని.. ఇందుకు కావాల్సిన సామగ్రిని ఇతర దేశాల నుండి తెప్పించడంలో కొంత ఆలస్యం జరిగిందని దాస్యం వినయ భాస్కర్ తెలిపారు. ఇటీవల పురపాలక శాఖా మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో నిధులు కేటాయించడం వల్ల పనులను మళ్లీ ప్రారంభించినట్లు వివరించారు. కాళోజీ గొప్ప చరిత్రను భావితరాలకు అందించే విధంగా కృషి చేయడంతో పాటు కవులకు, కళాకారులకు నిలయంగా ఈ కళా క్షేత్రం పని చేస్తోందని ఆయన చెప్పుకొచ్చారు. ఈ కాళోజీ కళాక్షేత్రం పూర్తి అయితే దాదాపు 1500 మంది కూర్చునే సామర్థ్యం ఉన్న కళావేదికను అందుబాటులోకి వస్తుందని వినయ భాస్కర్ వివరించారు. అలాగే ఇది రవీంద్ర భారతి కంటే ఎక్కువగా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. నిర్మాణ పనులను వేగవంతం చేసి రాష్ట్ర అవతరణ దినోత్సవంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. 



రాత్రింబవళ్లు కష్టపడి జూన్ రెండులోగా పూర్తి చేయాలి..


కుడా వైస్ చైర్మన్ ప్రావీణ్య మాట్లాడుతూ.. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణ పనుల బాధ్యతలను గత నవంబర్ లో పర్యాటక శాఖ నుండి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ తీసుకోవడం జరిగిందన్నారు. కాళోజీ కళాక్షేత్ర నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 73 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని, అందులో మొదటి విడతలో మంజూరైన 23 కోట్ల రూపాయలను ఖర్చు చేసి సివిల్ వర్క్ నిర్మాణం చేయడం జరిగిందని తెలిపారు. రెండో విడతల్లో మంజూరైన 40 కోట్ల రూపాయలతో ఇంటీరియర్ డిజైనింగ్ ఫినిషింగ్ వర్క్ చేపట్టడం జరుగుతుందన్నారు. పనులు త్వరితంగా చేపట్టేందుకు గాను అధికారులు కాంట్రాక్టర్లతో పలు దఫాలు సమావేశాలు కూడా నిర్వహించారని స్పష్టం చేశారు. కూలీలను అధికంగా పెంచి రాత్రింబవళ్లు పని చేయించి నిర్దిష్ట గడువులోగా పనులను పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో  కూడా ప్రాజెక్ట్ ఆఫీసర్ అజిత్ రెడ్డి , ఈఈ భీంరావు, హార్టికల్చర్ ఆఫీసర్ వేణుగోపాల్ టూరిజం అధికారి శివాజీ, కాళోజీ ఫౌండేషన్ సభ్యులు శ్రీనివాస రావు, అధికారులు, కాంట్రాక్టర్ తదితరులు పాల్గొన్నారు.