మోసాలు, నేరాలు చేయడంలో పురుషులే కాదు మహిళలు కూడా తెలివి ప్రదర్శిస్తున్నారు. బలహీనతలు ఉన్న మగవారిని గుర్తించి మరీ బుట్టలో వేసుకుంటున్నారు. వారితో కొన్నాళ్లు సఖ్యంగా ఉండి చేతికందినది దోచుకొని మొత్తం సర్దేస్తున్నారు. సాధారణంగా నిత్య పెళ్లికొడుకుల గురించి మనం వార్తల్లో వింటూ ఉంటాం. కానీ నిత్య పెళ్లి కూతురు గురించి చాలా అరుదుగా వింటూ ఉంటాం. తాజాగా అలాంటి నిత్య పెళ్లి కూతురి వ్యవహారమే వెలుగులోకి వచ్చింది. మందు, సిగరెట్ల అలవాట్లతో కాపురంలో కావాలని గొడవలు తెచ్చి పెట్టుకొని తుర్రుమని వెళ్లిపోయింది.


పోలీసులు వెల్లడించిన వివరాలు ఇవీ.. పెద్దపల్లి జిల్లా రామగుండం ఎన్టీపీసీ చెందిన రేవంత్ అనే వ్యక్తి బాధితుడు. స్థానికంగా ఉన్న అన్నపూర్ణ కాలనీకి చెందిన రేవంత్ పాన్ షాప్ నడుపుకుంటూ జీవిస్తున్నాడు. అతనికి గతంలోనే పెళ్లి అయినా గొడవల కారణంగా భార్యకు విడాకులు ఇచ్చి ఒంటరిగా బతుకుతున్నాడు. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఈ క్రమంలోనే ఓ ఆన్ లైన్ మాట్రిమోనీలో తన ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్నాడు. అందులో వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి అతనికి పరిచయం అయింది. ఆమె ప్రొఫైల్ బావుందని తెలుసుకొని సంప్రదించాడు. ఆ తర్వాత ఫోన్‌లో ఇద్దరూ ముచ్చట్లు పెట్టుకున్నారు. తనకు ఇదే మొదటి పెళ్లి అని, వరుడి కోసం ఎదురు చూస్తున్నట్లు యువతి చెప్పుకుంది. తరచూ ఫోన్లు మాట్లాడుకోవడంతో ఆమెపై నమ్మకంతో పాటు ఇష్టం కూడా ఏర్పడింది. ఇద్దరు పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. రెండు కుటుంబాల తరపున వారు ఒప్పుకోవడంతో వారూ అంగీకరించారు. ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో నిరాడంబరంగా పెళ్లి చేసుకుని కొత్త కాపురం పెట్టారు.


అయితే, పెళ్లి జరిగిన కొన్ని రోజులకే యువతి అసలు స్వరూపం బయటికి వచ్చింది. తనకు మందు, సిగరెట్ల అలవాటు ఉందని, అతడిని వేధించడం మొదలు పెట్టింది. దీంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. అలా కొన్నాళ్లు కలహాల కాపురం సాగింది. కొన్ని రోజుల తర్వాత తాను తన బంధువుల ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి యువతి తిరిగి రాలేదు. అలా వెళ్తూ వెళ్తూ 70 వేల నగదు, 4 తులాల బంగారంతో వెళ్లిపోయింది. ఆమె ఎంతకూ తిరిగి రాకపోవడంతో రేవంత్‌కు అనుమానం మొదలైంది.


ఆమె గురించి ఆరా తీయగా, ఆమెకు గతంలో మూడు పెళ్లిళ్లు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నట్లు తేలింది. చివరకు ఆమె ఎక్కడుందో తెలుసుకుని వెళ్లేసరికి, తన భార్య తన స్నేహితులతో విలాసాల్లో మునిగి తేలుతూ ఉండడం గమనించాడు. అతడిని చూసి షాక్ అయిన యువతి.. అక్కడ ఉన్నవారితో ఏకంగా భర్త రేవంత్‌పైనే దాడి చేయించింది. పోలీసులకు చెప్తే కొన్ని ప్రైవేటు వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తానని బెదిరించింది. అతడి కుటుంబ సభ్యులను కూడా డబ్బుల కోసం వేధించడం మొదలు పెట్టింది. దీంతో రేవంత్ ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించాడు.