Warangal Politics: వరంగల్ తూర్పు నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు బయటపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రహదారుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా మెట్టు శ్రీనివాస్ ఇటీవల నియమితులయ్యారు. మెట్టు శ్రీనివాస్ ఆదివారం హైదరాబాద్‌లో ప్రమాణస్వీకారం చేయనున్న నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అనుచరులు పెద్ద ఎత్తున వరంగల్‌లో ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. వరంగల్‌లోని ప్రధాన కూడళ్లయిన వరంగల్ చౌరస్తా, పోచమ్మ మైదాన్ సెంటర్, కాశిబుగ్గ, పోస్టాఫీస్ సెంటర్‌తో పాటు మరికొన్ని సెంటర్లు, డివిజన్ కూడళ్లలో శనివారం రాత్రి ఫ్లెక్సీలు కట్టారు. అయితే శనివారం తెల్లవారుజాము నుంచి టీఆర్ఎస్‌లోని ఓ వర్గం నేతలు ఫ్లెక్సీలను చించివేసినట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫ్లెక్సీల్లో మెట్టు శ్రీనివాస్, మేయర్ గుండు సుధారాణి, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, టీఆర్ఎస్ నేత రాజనాల శ్రీహరిల ఫొటోలను మాత్రమే చించేయడంతో దుమారం మరింత రేగింది. ఇప్పుడు ఈ అంశం రాజకీయ వివాదంగా మారుతోంది. ఎర్రబెల్లి ప్రదీప్‌రావు అనుచరులైతే నేరుగా ఎమ్మెల్యే నరేందర్ ప్రొద్బలంతోనే ఈ ఫ్లెక్సీల చించివేత జరిగిందని పేర్కొంటుండటంతో రాజకీయం వేడేక్కుతోంది.
వరంగల్ తూర్పులో కొద్దికాలంగా ఎమ్మెల్యే నరేందర్ సొంత పార్టీ నేతల నుంచి అసమ్మతిని ఎదుర్కొంటున్న మాట వాస్తవమే. అభివృద్ధి కార్యక్రమాలకు కనీసం ప్రొటోకాల్ ప్రకారం కూడా మేయర్ గుండు సుధారాణితో పాటు ఎమ్మెల్యే సారయ్యలకు ఆహ్వానం అందడం లేదనే విమర్శలు ఉన్నాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గం పరిధిలోని కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు తెలియకుండా మేయర్‌ను గానీ, ఎమ్మెల్సీలను గాని కలిసే సాహసం కూడా చేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఈ నియోజకవర్గం నుంచి టికెట్ ఆశిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారంలో ఉన్న ప్రదీప్‌రావుతో కూడా నరేందర్ రాజకీయ పోరు సలుపుతున్నారని ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల ఎర్రబెల్లి ప్రదీప్‌రావు ఆత్మీయ పరామర్శలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టడంతో ఎమ్మెల్యే వర్గీయులకు మింగుడుపడటం లేదన్నది వాస్తవం. పలు డివిజన్లలో సొంతంగా కేడర్ నిర్మించుకుంటున్నారనే వేగుల సమాచారంతో ఎమ్మెల్యే నరేందర్, ఆయన వర్గీయులు తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఫ్లెక్సీల చించివేత వివాదం తెరమీదకు రావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
వరంగల్ తూర్పు టీఆర్ఎస్‌లో నివురుగప్పిన నిప్పులా ఉన్న రాజకీయ విబేధాలు ఇప్పుడు బహిర్గతమవుతున్నాయి. రౌడీయిజం, గుండాయిజం విధానాలతో రాజకీయంగా అణిచివేత ధోరణులను అవలంబిస్తే ఊరుకోబోమని ఎర్రబెల్లి ప్రదీప్‌రావు వర్గం నేతలు వార్నింగ్ ఇస్తుండటం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్యే అనుచరులుగా చెప్పుకొంటున్న కొంతమంది నేతలు ఫ్లెక్సీలు కట్టడం కాదు.. ఫ్లెక్సీలు కాపాడుకునే దమ్ము కూడా ఉండాలి అంటూ సినిమా స్టైల్లో వార్నింగ్‌తో చర్చ మొదలుపెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా వరంగల్ తూర్పు రాజకీయం ఫ్లెక్సీల చించివేతతో ఒక్కసారిగా వేడెక్కింది. ఫ్లెక్సీల చించివేత ఘటనను ఎర్రబెల్లి ప్రదీప్‌రావు చాలా సీరియస్‌గా తీసుకున్నట్లు సమాచారం. సోమవారం ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ ప్రెస్‌మీట్‌లో ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.