Warangal Preeti Incident: సీనియర్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకున్న ప్రీతి అనే మెడికో చనిపోయిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో ర్యాగింగ్ విష సంస్కృతికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య కళాశాలల బంద్ కు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ - ఏబీవీపీ పిలుపునిచ్చింది. ప్రీతి ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని, మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నంపై వైద్య విద్య కాలేజీల్లో ర్యాగింగ్ సాధారణమని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలని ఏబీవీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలల బంద్ కోసం నిరసనలు చేపడుతున్న ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 


సైఫ్ ను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాలి..


మెడికో ప్రీతి ఆత్మహత్య ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ఏబీవీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దారావత్ ప్రీతీ కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు. మెడికో ప్రీతీ ఆత్మహత్యకు కారకుడైన సైఫ్, కళాశాల అధికారులను కఠినంగా శిక్షించడంతో పాటు.. రాష్ట్రంలో తరచూ వెలుగు చూస్తున్న ర్యాగింగ్ విష సంస్కృతిని నిషేధించేలా ప్రభుత్వం ప్రత్యేక కమిటీ నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. డాక్టర్ ప్రీతీ ఆత్మహత్యాయత్నం అనంతరం వైద్య విద్య కళాశాలలో ర్యాగింగ్ సాధారణమే అని ప్రకటించిన అధికారులను సస్పెండ్ చేయాలని ప్రభుత్వానికి ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.


ప్రీతి తండ్రి నరేంద్ర సంచలన వ్యాఖ్యలు..


తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని, ఆమె తండ్రి నరేందర్‌ ఆరోపించారు. ప్రీతి తనకు తానుగా ఇంజక్షన్ చేసుకోలేదని, ఎవరో ఇంజక్షన్‌ ఇచ్చారని అన్నారు. సైఫ్ అనే వ్యక్తే ప్రీతికి ఇంజక్షన్ ఇచ్చి ఉంటాడని అనుమానం వ్యక్తం చేశారు. ఆ కోణంలో పోలీసులు విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు.  ప్రీతి మృతి చెందడానికి గల కారణాలను పోలీసులు విచారణలో కనుగొనాలని పిలుపునిచ్చారు. కాకతీయ మెడికల్‌ కాలేజీ అనస్థీషియా డిపార్డ్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్‌ చేయాలని, ఆ తర్వాత ఈ వ్యవహారంలో సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేస్తేనే ప్రీతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలు, నిజానిజాలు బయటకు వస్తాయని చెప్పారు. ఆదివారం రాత్రి (ఫిబ్రవరి 26) నిమ్స్ ఆస్పత్రి నుంచి ప్రీతి శరీరాన్ని తరలించేటప్పుడు కూడా ఆమె తండ్రి నరేంద్ర కొన్ని డిమాండ్స్ చేశారు. మెడికల్ కాలేజీలో అనస్థీషియా డిపార్ట్ మెంట్ హెచ్‌వోడీని సస్పెండ్‌ చేసిన తర్వాతే సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరపాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఎలా చనిపోయిందో తెలిపే సమగ్ర రిపోర్టు కావాలని నరేందర్‌ కోరారు. మరణానికి కారణాలు చెబితేనే మృతదేహాన్ని తీసుకుంటామని, లేకపోతే ఇక్కడే ఆత్మహత్య చేసుకుంటానని తేల్చి చెప్పారు. 


మృతదేహాన్ని అంబులెన్స్‌లో తరలించేందుకు పోలీసులు ప్రయత్నించగా.. కుటుంబ సభ్యులు, గిరిజన, విద్యార్థి సంఘాలు అడ్డగించాయి. ఈ సందర్భంగా తోపులాట చోటుచేసుకుంది. ఆందోళనకారులు ఏఆర్‌సీ వార్డు ముందు భద్రతా సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. ఐసీయూ గ్లాస్‌ డోర్‌ను కూడా బద్దలుకొట్టారు. కొందరు మహిళలు అంబులెన్స్‌కి అడ్డుపడటంతో పాటు తాళం లాక్కున్నారు.