Warangal News: వర్షాల వేళ అడవుల్లో జల్లెడ, గ్రామాల నిండా భద్రతా దళాలు! టెన్షన్‌లోనే ప్రజలు

Telangana News: మావోయిస్టుల కోసం తెలంగాణ సరిహద్దు గ్రామాలతో పాటు అడవులను కూడా పోలీసులు గాలిస్తున్నారు. గిరిజన గ్రామాలు, గుడాల ప్రజలపై పోలీస్ లు డేగ కన్ను వేశారు.

Continues below advertisement

Warangal Maoists News: పోలీస్ బలగాలు అడవిని జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టుల ఏరివేతలో భాగంగా మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లోని అడవులను పోలీసులు జల్లెడ పడుతున్నారు. ఓవైపు మావోయిస్టుల వారోత్సవాలు మరోవైపు పోలీసుల కూంబింగ్ కొనసాగుతుంది. తెలంగాణ సరిహద్దు గ్రామాలతో పాటు అడవులను పోలీసులు గాలిస్తున్నారు. 

Continues below advertisement

మావోయిస్టుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు కూంబింగ్ ను కట్టుదిట్టం చేశారు. జూలై 28వ తేదీ నుండి ఆగష్టు 3 వ తేదీ వరకు అమరవీరుల వారోత్సవాలు జరగనున్నాయి. మావోయిస్టు పార్టీ వారోత్సవాలను ఘనంగా నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. మావోయిస్టులకు పట్టున్న తెలంగాణ సరిహద్దు ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర అడవుల్లో రెడీమేడ్ స్తూపాలను ఏర్పాటు చేయడంతో పాటు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తారు. అంతేకాకుండా అమరవీరుల వారోత్స కార్యక్రమాలైన సమావేశాలకు గిరిజనులను ఆహ్వానిస్తారు. ఈ నేపథ్యంలో పోలీస్ బలగాలు అప్రమత్తమై అడవులను, అటవీ గ్రామాలను జల్లెడ పడుతున్నారు.

గిరిజన గ్రామాలు, గుడాల ప్రజల పై పోలీస్ లు డేగ కన్ను వేశారు. వారి కదలికలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా ఏజెన్సీ గ్రామాలకు రాకపోకలు సాగించే ప్రజలపై నిఘా పెంచారు. మావోయిస్టు సానుభూతి పరులకు తీవ్ర హెచ్చరికలను జారీ చేశారు పోలీస్ లు. మావోయిస్టుల అమరవీరుల వ్వారోత్సవాలను భగ్నం చేయడానికి ప్రత్యేక వ్యూహంతో వ్యవహరిస్తున్నారు పోలీస్ బలగాలు.

అయితే వర్షాకాలం కావడంతో మావోయిస్టులకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవచ్చు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అడవులు చిక్కగా మారడంతో పాటు అడవుల్లో వాగులు ఉప్పొంగుతున్నాయి. ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆ ప్రభావం తెలంగాణపై తీవ్రంగా ఉంది. దీంతో అడవుల్లోని వాగులు, గోదావరి ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పోలీస్ బలగాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో కి వెళ్లడం కష్టంగా మారిందని చెప్పవచ్చు. పోలీస్ బలగాలు మట్టుపెట్టడమే లక్ష్యంగా పోలీస్ బలగాలు రాకపోకలు సాగించే ప్రాంతాల్లో మందుపాతరలు అమర్చి మావోయిస్టులు దాడులు చేసే అవకాశాలు లేకపోలేదు. అయినా కేంద్ర సాయుధ బలగాలతో లోకల్ పోలీస్ ల సహకారంతో ప్రత్యేక వ్యూహంతో అడవుల్లోకి వెళ్తున్నారు.

కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కాగార్ పేరుతో చేపట్టిన ఆపరేషన్ లో మావోయిస్టు చరిత్రలో ఈ ఏడాది జరిగిన నష్టం ఎప్పుడు జరగలేదు. గడిచిన ఏడు నెలల్లో సుమారు రెండు వందల మంది మావోయిస్టులు ఛత్తీస్ ఘడ్, మహరాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో మృతి చెందడం జరిగింది. ఓవైపు వారోత్సవాలు... మరో వైపు వర్షాకాలం మావోయిస్టులకు కలిసి రానుండడంతో పోలీస్ లపై ప్రతీకార దాడులకు దిగే అవకాశం ఉండడంతో పోలీస్ లు అప్రమత్తమయ్యారు. 

మావోయిస్టులు తెలంగాణ ప్రాంతంలోకి వచ్చే అవకాశం ఉందనే నిఘా వర్గాల హెచ్చరికలతో ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దుల్లో పోలీస్  కూంబింగ్ చేస్తున్నారు. వారం రోజుల క్రితం భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లా సరిహద్దుల్లోని గుండాల మండలం దామరతోగు అడవుల్లో కూంబింగ్ కు వెళ్లిన స్పెషల్ పార్టీ పోలీసులకు మావోయిస్టు లకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో దళ సభ్యుడు నల్లమారి అశోక్ అలియాస్ విజేందర్ మృతి చెందారు. దీంతో పోలీస్ లు అప్రమత్తమయ్యారు.

మావోయిస్టుల అమరుల వారోత్సవాలు.. మరోవైపు పోలీస్ బలగాలు అడవులను జల్లెడ పడుతున్న నేపథ్యంలో ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర, తెలంగాణ సరిహద్దుల్లో ఏ సమయంలో ఏం జరుగుతుందనే టెన్షన్ వాతావరణం నెలకొంది.

Continues below advertisement