Warangal Hanamkonda Districts: ఉద్యమాలకు కేరాఫ్ గా ఉన్న వరంగల్లో మరో ఉద్యమం మొదలవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత జిల్లాల పునర్విభజన జరిగింది. అయితే వరంగల్ నగరాన్ని రెండు జిల్లాలుగా విభజించారు. నగరాన్ని ఏకం చేయాలనే ఉద్యమం మొదలైంది.


వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా..
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2016 అక్టోబర్ 11వ తేదీన అప్పటి ప్రభుత్వం వరంగల్ జిల్లాను ఐదు జిల్లాలుగా విభజించింది. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, మహబూబాబాద్, భూపాల్ పల్లి జనగామ జిల్లాలుగా పునర్విభజన జరిగింది. వరంగల్ నగరంతో పాటు కరీంనగర్, వరంగల్ సరిహద్దు ప్రాంతాలను కలుపుకొని వరంగల్ అర్బన్ జిల్లాగా ఏర్పాటు అయింది. వరంగల్ కార్పొరేషన్ పరిధితో పాటు చుట్టుపక్కల గ్రామాలు వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో కొనసాగాయి. 2021వ సంవత్సరంలో మరోసారి జిల్లాల చేర్పులు మార్పులు చేసి వరంగల్ అర్బన్ ను హన్మకొండగా, వరంగల్ రూరల్ ను వరంగల్ జిల్లాగా మార్చారు.


వరంగల్ అర్బన్ టూ హన్మకొండ జిల్లాగా మార్పు
కాకతీయుల రాజధాని వరంగల్ అనగానే త్రినగరి గుర్తుకొస్తుంది. హనుమకొండ, వరంగల్, కాజీపేటలను కలుపుకొని వరంగల్ ను త్రినగరిగా పిలుస్తారు. చారిత్రక కట్టడాలు, అనేక ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలతో పాటు జిల్లా, ప్రాంతీయ కార్యాలయాలకు వరంగల్ నగరం నిలయం. 2016 అక్టోబర్ 11వ తేదీన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా వరంగల్ నగరాన్ని వరంగల్ అర్బన్ జిల్లాగా మార్చారు. దీంతో వరంగల్ నగర అస్తిత్వానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదు సిటీ అంతా ఓకే పరిధిలో ఉండడంతో అందరూ హ్యాపీగా ఫీలయ్యారు.




రెండు ముక్కలైన ఏకశిల నగరం
జిల్లాల మార్పులు చేర్పు్ల్లో భాగంగా 2021 ఆగస్టు 21న వరంగల్ అర్బన్ జిల్లాను హన్మకొండ జిల్లాగా మార్చడం జరిగింది. పేరు మార్పుతో వచ్చిన సమస్యే లేదు. కానీ వరంగల్ నగరం మొత్తం వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలో ఉండేది. అర్బన్ పేరు మార్పుతో పాటు నగరాన్ని రెండు ముక్కలుగా చేసి హనుమకొండ జిల్లాగా.. వరంగల్ రూరల్ ను వరంగల్ జిల్లాగా మార్చారు. ఏకశిల నగరాన్ని రెండు ముక్కలు చేసి హనుమకొండ, వరంగల్ జిల్లాలుగా చేసింది అప్పటి ప్రభుత్వం. దీంతో వరంగల్ అస్తిత్వానికి దెబ్బ పడింది. శ్రీనగరిగా ఉన్న వరంగల్ నగరాన్ని రెండు ముక్కలు చేయడంతో నగరవాసులతో పాటు మేధావులు విద్యావంతులు తీవ్రంగా వ్యతిరేకించారు కానీ ఫలితం లేదు. హనుమకొండ, కాజీపేట ప్రాంతంతో హనుమకొండ జిల్లాగా... వరంగల్ ప్రాంతం, హనుమకొండలోని కొత్త ప్రాంతాన్ని వరంగల్ జిల్లాగా ప్రకటించారు. దీంతో గ్రేటర్ వరంగల్ పరిధితో పాటు చారిత్రక ఏకశిల నగరం రెండు ముక్కలు ముక్కలైంది. చారిత్రక నగరానికి వచ్చే అధితులు, పర్యాటకులు ఇటు పోతే హనుమకొండ జిల్లా, అటుపోతే వరంగల్ జిల్లా ఏంటని ఆశ్చర్యానికి గురవుతున్నారు.


నగరమంతా ఒకే జిల్లాగా ఉండాలి
వరంగల్ మహా నగరం అస్తిత్వం కోల్పోతుండడంతో వరంగల్ నగరం ఒకే జిల్లాగా ఉండాలనే పోరాటం మొదలైంది. మహానగరం ఏకీకరణ, పునర్నిర్మాణ కమిటీ పేరుతో ఉద్యమాన్ని ప్రారంభించారు. నగర పరిధిలోని మేధావులు విద్యావంతులు మాజీ ప్రజాప్రతినిధులు కలిసి ఉద్యమాన్ని మొదలుపెట్టారు. ఈ ఉద్యమ కమిటీ లక్ష్యం త్రినగరిగా, ఏకశిల నగరంగా పేరున్న వరంగల్ నగరాన్ని ఒకే జిల్లా పరిధిలోకి తేవాలని వీరి పోరాటం. నగర పరిధిలోని  మేధావులు, విద్యావంతులు, వ్యాపారులు, విద్యార్థులు, నగర పౌరులను కలుపుకొని ఉద్యమాన్ని ఉధృతం చేయాలని మహానగర ఏకీకరణ కమిటీ ముందుకు వెళ్తుంది.


నగరం ఒకే జిల్లాలో ఉండడం వల్ల విద్యాపరంగా వ్యాపార పరంగా అభివృద్ధి చెందడంతో పాటు హైదరాబాద్ తర్వాత పెద్ద నగరంగా వెలుగొందుతుందని కమిటీ సభ్యులు చెప్పారు ఏకీకరణ కోసం నగరంలో ఉన్న ప్రతి పౌరుని విద్యావంతుని మేధావుని మద్దతు తీసుకుంటున్నామని ప్రత్యేక కార్యచరణతో ముందుకు వెళ్తామని కమిటీ భాద్యులు సంపత్ రెడ్డి, యాదవరెడ్డి, పెద్ది వెంకట్ నారాయణ చెప్పారు.