Watch Video: ఇటీవల కాలంలో చిన్నారులు బిందెలో తలదూర్చి తల్లిదండ్రులను పరుగులు పెట్టించిన ఘటనలు చాలానే చూశాం. తాజాగా ఇప్పుడు ఇత్తడి కొప్పెరలో ఇరుక్కుపోయాడు ఓ రెండేళ్ల బాలుడు.


అసలేం జరిగిందంటే..? 


వరంగల్ జిల్లా పర్వతగిరి  మండలం మూడెత్తుల తండా గ్రామ పంచాయతీ పరిధిలోని గుడి తండాలో భూక్య దేవి నాయక్ దంపతులకు చెందిన రెండేళ్ల కుమారుడు ఇత్తడి కొప్పెరలో ఇరుక్కుపోయాడు. తల్లిదండ్రులు ఇంట్లోని వారంతా ఎవరి పనుల్లో వారు బిజీగా ఉండగా.. బాలుడు బయట ఖాళీగా ఉన్న ఇత్తడి కొప్పెరతో ఆడుకుంటున్నాడు. అంతలోనే పొరపాటున అందులో దిగి ఇరుక్కుపోయాడు.   శరీరం భాగం అంతా అందులోనే ఉండగా.. కేవలం తల భాగం మాత్రమే పైకి కనిపిస్తోంది. అందులో ఇరుక్కుపోయిన బాలుడికి ఎలా బయటకు రావాలో తెలియక గట్టిగా ఏడ్వడం మొదలు పెట్టాడు. దీంతో బాబుకు ఏమైందోనని పురుగు పరుగున అక్కడికి వచ్చిన తల్లిదండ్రులు బాలుడు కొప్పెరలో ఇరుక్కుపోవడం చూసి తీవ్ర ఆందోళనకు గురయ్యారు. 


అందులోంచి బాలుడిని బయటకు తీసేందుకు ఎంతగానో కష్టపడ్డారు. అయినప్పటికీ వారి వల్ల కాలేదు. దీంతో కొప్పెరలో ఉన్న బాలుడిని స్థానికంగా ఉన్న వెల్డింగ్ షాపు వద్దకు తీసుకెళ్లారు. వెంటనే బాలుడిని బయటకు తీయమని కోరారు. ఇలా గంటల పాటు శ్రమించి కటర్లను ఉపయోగించి కొప్పెరను కత్తిరించారు. అనంతరం బాలుడిని క్షేమంగా బయటకు తీశారు. ఆ తర్వాత వెంటనే అతడిని ప్రాథమిక చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.


ఇటీవలే డబ్బా మూత గొంతులో ఇరుక్కొని చనిపోయిన చిన్నారి


పాపం పెళ్లైన 20 ఏళ్ల వరకు వారికి సంతానం కల్గలేదు. ఇందుకోసం మొక్కని దేవుడు, తొక్కని ఆస్పత్రి గడపా లేదు. ఏ దేవుడి కరుణో తెలియదు కానీ వారికి పది నెలల క్రితమే సంతానం కల్గింది. ఇక ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నప్పటి నుంచి ఆమెపై తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కాదు. బిడ్డ పుట్టాక కూడా బిడ్డపై అమితమైన ప్రేమను చూపిస్తూ.. ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నూతన సంవత్సర వేడుకలను కూడా ఈ ఏడు సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ వారి కోరిక ఎంతో సేపు నిలవలేదు. పండుగ పూటే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల తర్వాత పుట్టిన ఏకైక సంతానం తమకు దక్కకుండా పోయింది.


అసలేం జరిగిందంటే..?


కర్నూలు జిల్లా సి,బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాధం నెలకొంది. గ్రామానికి చెందిన నల్లమ్మ, సువర్ణ దంపతుల పది నెలల కుమారుడు ఉన్నాడు. ఆదివారం రోజు అతడు మెంతో ప్లస్ బామ్ డబ్బాతో ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. పొరపాటున మింగేయగా.. అది గొంతులో ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు డబ్బాను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. బాలుడు మృతి చెందాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బాబు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాబు గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడకనే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఎన్నో దేవుళ్లకు పూజలు చేయగా, మరెన్నో ఆస్పత్రుల చుట్టూ తిరగ్గా.. పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బిడ్డ ఇలా నూతన సంవత్సరం రోజే చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ఏడుస్తున్న తీరు చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరుపెడుతున్నారు.