Doctor Rajeshwari Special Story: మనం చదువుకున్న బడికే టీచర్ గా వెళ్లడమో, లేదో పెద్ద స్థాయికి చేరుకున్నాక ముఖ్య అతిథులుగా వెళ్లడమో చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఇది అంతకు మించిన అనుభూతిని ఇచ్చే అరుదైన ఘటన. ఏంటంటారా.. ఓ అమ్మాయి పాతికేళ్ల కిందట ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పుట్టింది. ఏవైనా అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు కూడా అదే ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందింది. ప్రస్తుతం అదే ఆసుపత్రికి వైద్యురాలుగా వెళ్లి ఎంతో మందికి మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. ఈ అరుదైన ఘటన వరంగల్ జిల్లా నర్సంపేటలో చోటు చేసుకుంది.
పుట్టిన ఆసుపత్రిలోనే డాక్టర్‌గా సేవలు
గత 25 సంవత్సరాల క్రితం నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో బానోత్ రాజేశ్వరి అనే అమ్మాయి జన్మించింది. ప్రస్తుతం అదే అమ్మాయి అక్కడి ఆసుపత్రిలోనే వైద్యురాలిగా సేవలు అందిస్తోంది. వినడానికి ఆశ్చర్యంగా అనిపిస్తున్న ఇది నిజం. రాజేశ్వరి వైద్య విద్య పూర్తి చేసుకుని ప్రభుత్వ దవాఖానాలో ఉద్యోగం పొందారు. ఆమె పుట్టిన జనవరి నెలలోనే బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ప్రస్తుతం ఆసుపత్రి సూపరింటెండెంట్ గా ఉన్న డాక్టర్ గోపాల్.. రాజేశ్వరికి బాల్యంలో వైద్యం చేశారు. ఇప్పుడు రాజేశ్వరి ఆయన వద్దే వైద్యురాలిగా చేరడం విశేషంగా మారింది. గీసుకొండ మండలం విశ్వనాథపురానికి చెందిన గిరిజన దంపతులు వాంకుడోతు రాజు, రమాదేవిలకు 1998 జనవరి 16న నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో రాజేశ్వరి జన్మించారు.
వ్యవసాయ కుటుంబం నుంచి ఎదిగిన ఆమె ఇటీవల ప్రభుత్వం చేపట్టిన శాశ్వత నియామకాల్లో వైద్య విధాన పరిషత్ కు ఎంపిక అయ్యారు. ప్రతిభ ఆధారంగా నర్సంపేట సీహెచ్ సీ లో ఉద్యోగం పొందారు. రాజేశ్వరి భర్త బానోతు భరత్ ప్రస్తుతం అస్సాంలో ఓఎన్ జీ సీ లో పని చేస్తున్నారు. అయితే తాను పుట్టిన ఆస్పత్రిలోనే వైద్య సేవలు అందించడం తనకు చాలా గర్వంగా ఉందని డాక్టర్ రాజేశ్వరి చెబుతున్నారు. తనలాంటి ఎంతో మంది పేద, మధ్య తరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంలో తానెప్పుడూ ముందుంటానని ఆమె వివరిస్తున్నారు. తనలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టిన వారు, సర్కారు బడుల్లో చదువుకున్న వారు ఉన్నత స్థాయికి చేరుకొని.. ఇలాంటి అరుదైన, మదురమైన అనుభూతిని పొందాలని సూచిస్తున్నారు.