Mahabubabad District: మహబూబాబాద్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పెద్ద నష్టం వాటిల్లుతోంది. కేసముద్రము మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. దీంతో మహబూబాబాద్ మీదుగా వెళ్తున్న రైళ్లకు ఆటంకం కలిగింది. మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, సహా పలు రైళ్లను అధికారులు నిలిపివేశారు.


వరంగల్‌లో వర్ష బీభత్సం
వర్ష బీభత్సానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు ప్రాంతాలు అతలాకుతలం అవుతున్నాయి. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో వర్ష బీభత్సం ఉంది. భారీగా వరద నీరు చేరుతుండటంతో చెరువులు ఉప్పొంగుతున్నాయి. రావిరాల గ్రామం జలమయం అయింది. గ్రామంలో చెరువు మత్తడి పక్కనే ఉన్న ఇండ్లలోకి నేరు చేరడంతో ప్రజలు ఇళ్ల పైకి ఎక్కి ఎక్కారు. వరద ప్రభావంతో ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంటి ముందు పెట్టిన ఆటో కొట్టుకు పోయాయి. సాగర్ కుటుంబంతో పాటు, మరో మూడు కుటుంబాలు ఇంటి స్లాబ్ పై వర్షంలో తడుస్తూ సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఓ పక్క చీకటి, మరోపక్క వర్షం, ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని అధికారులను కుటుంబ సభ్యులు వేడుకొంటున్నారు.


వర్షపు నీటికి గ్రామానికి రాకపోకలు నిలిచిపోయాయి. రాత్రి ఒంటి గంట నుంచి ఇంటి స్లాబ్ పై బిక్కుబిక్కుమంటూ సహాయం కోసం బాధితులు ఎదురు చూస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టాలని జిల్లా రెవెన్యూ, పోలీస్ ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులకు గ్రామస్థుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఇరుక్కుపోయిన బస్సు


వరంగల్ జిల్లా నెక్కొండ - వెంకటాపురం చెరువు కట్ట మీద ఆర్టీసీ బస్సు వరదలో చిక్కుకుంది. దిక్కుతోచని పరిస్థితిలో 45 మంది ప్రయాణికులు ఉన్నారు. వరంగల్ నుంచి మహబూబాబాద్ వెళ్తున్న TS24Z 0018 నెంబరు గల ఆర్టీసీ బస్సు నెక్కొండ - వెంకటాపురం చెరువు కట్ట పైన నిన్న రాత్రి వరద ప్రభావంతో చిక్కుకు పోయింది. రాత్రి నుండి ఇప్పటివరకు ముందుకు వెనకకు పోలేకపోయింది. దీంతో ప్రాణాపాయ పరిస్థితిలో అందులోని ప్రయాణికులు సహాయం కోసం ఎదురు చూస్తున్నారు.