Warangal News: వరంగల్‌లో పాత బస్ స్టేషన్ స్థానంలో కొత్త బస్ స్టేషన్ మోడల్ ను విడుదల చేశారు. కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటీ పనులను ముమ్మరం చేసింది. వీలైనంత త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయాలని అనుకుంటోంది. 2.32 ఎకరాల్లో రూ.75 కోట్ల అంచనా వ్యయంతో 32 ప్లాట్ ఫారమ్‌లతో ఐదు అంతస్తుల భవనం రానుంది. ఈ భవనంలో కమర్షియల్ కాంప్లెక్స్, షాపింగ్ మాల్స్, హోటల్స్, ఇతర వసతులు ఉంటాయి. వరంగల్ రైల్వే స్టేషన్, కొత్తగా నిర్మించనున్న నియో మెట్రో రైలుకు దీన్ని అనుసంధానం చేస్తారు.
విశాలమైన బస్ స్టాండ్..
వరంగల్ బస్ స్టేషన్ ఆవరణ, దాని చుట్టు పక్కల స్థలాలను కలిపి విశాలంగా కొత్త బస్టాండ్ ఉంటుంది. వరంగల్ బస్ స్టేషన్ పక్క నుంచి కూరగాయల మార్కెట్ మీదుగా కాశీబుగ్గ ప్రధాన రహదారికి కలిపేలా రోడ్డు నిర్మాణంపై చర్చలు నడుస్తున్నాయి. రెండున్నర ఎకరాల్లో కొత్త బస్టాప్ రానుంది. ఐదు అంతస్తుల భవనం నిర్మిస్తారు. 32 బస్ ప్లాట్ ఫారంలను నిర్మించనున్నారు. టీఎస్‌ఆర్‌టిసీ, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(జీడబ్ల్యూఎంసీ) అధికారులతో స్థలాన్ని పరిశీలించినట్టుగా తెలుస్తోంది. ప్రాజెక్టుపై సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు. 2050 లో కూడా నగరం రవాణా అవసరాలను తీర్చేందుకుడా డీపీఆర్ సిద్ధం చేశారు.
దశలవారీగా ప్రాజెక్ట్ పూర్తి..
ద్విచక్ర వాహనాలు, కార్ల పార్కింగ్ సెల్లార్, గ్రౌండ్ ఫ్లోర్ ఒక సంవత్సరం వ్యవధిలో నిర్మించబడుతుంది. (కేయూడీఏ) తన స్వంత డబ్బును ఖర్చు చేసి టీఎస్ఆర్టీసీ కోసం గ్రౌండ్ ఫ్లోర్‌ను అప్పగిస్తుంది. ఇతర అంతస్తులను ప్రైవేట్ వ్యక్తులకు లీజుకు ఇవ్వనున్నారు. ప్రారంభ ప్రతిపాదన ప్రకారం ఆదాయాన్ని కేయూడీఏ – టీఎస్ఆర్టీసీ పంచుకుంటుంది. కొత్త బస్ స్టేషన్ డిజైన్ ఇప్పటికే సిద్ధం అయింది. డిజైన్ ప్రకారం కొత్త బస్ స్టేషన్, ప్రతిపాదిత ‘నియో’ మెట్రో రైల్వే స్టేషన్ మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఇదిలావుండగా, ‘ఓ’ నగరంలోని తాత్కాలిక బస్ స్టేషన్ నుండి లేదా వార్నగల్ - నర్సంపేట రహదారిలోని మరొక ప్రదేశం నుండి బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు. డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టు (డీపీఆర్)కి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన తర్వాత టెండర్లు పిలిచి నిర్మాణ పనులు చేపట్టనున్నారు.
నిజామాబాద్ లోనూ బస్టాండ్ నిర్మాణానికి సీఎం పచ్చ జెండా
నిజామాబాద్ నగరవాసుల కల నెరవేరబోతోంది. నగరంలో కొత్తబస్టాండ్ ఏర్పాటుకు సీఎం కేసీఆర్ ఇటీవలే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎన్నో రోజులుగా పెండింగ్‌లో ఉన్న ఈ ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకం చేసినట్టు తెలిసింది. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ చాలా చిన్నది. రోజు రోజుకి పెరుగుతున్న నగర జనాభాతో ప్రయాణికుల సంఖ్య కూడా భారీగా పెరిగింది. దీంతో బస్సుల సంఖ్యను కూడా పెంచారు. బస్టాండ్ చిన్నది కావటంతో రద్దీగా మారింది. నిజామాబాద్ నుంచి ముంబయ్, హైదరాబాద్, నాగ్ పూర్ కు ఎక్కువగా ప్రయాణాలు జరుగుతాయ్. ప్రస్తుతం ఉన్న బస్టాండ్ కంజెస్టడ్‌గా ఉండటంతో జిల్లాకు సంబంధించిన నేతలు ఎప్పట్నుంచో బస్టాండ్ మార్పు కోసం ప్రతిపాదనలు పెట్టారు. అయితే ఆర్టీసీ ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ జిల్లాకే చెందిన వారు కావటం, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత చొరవతో సీఎం కేసీఆర్ కొత్త బస్టాండ్ కు ఆమోదం తలిపినట్లు సమాచారం.