Warangal News : వరంగల్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. నర్సంపేట మండలంలోని ఆకులతండాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. నర్సంపేట- మల్లంపల్లి హైవేపై ఇటుకాలపల్లి గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తాత, మూడేళ్ల మనవరాలు మృతి చెందారు. ఆకులతండాకు చెందిన ధరావత్ పాచ్య, నాగమ్మ దంపతులు తమ కుమారుడైన యాకూబ్ కూతురు పూర్ణిమతో కలిసి బైక్ పై శుక్రవారం మందుల కోసం ఇటుకాలపల్లిలోని మెడికల్ షాపునకు వెళ్లారు. మెడికల్ షాపులో మందులు తీసుకుని ముగ్గురు బైకుపై తిరిగి ఆకులతండాకు బయలుదేరారు.


సిమెంటు లారీ ఢీకొని ఇద్దరు మృతి


ముగ్గురు ప్రయాణిస్తున్న బైక్ ను ఇటుకాలపల్లిలోని హైవేపై సిమెంటు లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో మూడేళ్ల చిన్నారి పూర్ణిమ ఘటనాస్థలంలోనే చనిపోయింది. తీవ్రంగా గాయపడిన పాచ్య, నాగమ్మ దంపతులను చికిత్స కోసం స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో పాచ్య(62) మరణించాడు. తీవ్రగాయాలు పాలైన భార్య నాగమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. ఆమె పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్లు వైద్యులు అంటున్నారు. పాచ్య, నాగమ్మ దంపతుల కుమారుడు యాకూబ్ సీఆర్పీఎఫ్ కానిస్టేబుల్ గా ఛత్తీస్ గడ్ లో పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. మనవరాలు పూర్ణిమ ఆకులతండాలో తాత, నానమ్మ వద్ద తల్లితో సహా ఉంటుంది. మందుల కోసం మనవరాలిని వెంట తీసుకుని ఇటుకాలపల్లిలోని మెడికల్ షాపునకు వెళ్లగా లారీ రూపంలో మృత్యువు కబలించడంతో ఆకులతండాలో విషాదం నెలకొంది.  



రైలు, ప్లాట్ ఫామ్ మధ్య ఇరుక్కుని విద్యార్థిని మృతి


 విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్ లో నిన్న జరిగిన ప్రమాదం గురించి అందరికీ తెలిసిందే. అయితే రైలు దిగే క్రమంలో ప్రమాద వశాత్తు జారిపడి ప్లాట్ ఫాంకు రైలుకు మధ్య ఇరుక్కొని గంటలపాటు నరకం చూసిన విద్యార్థిని శశికళ గురువారం మృతి చెందింది. చికిత్స పొందతూ ప్రాణాలు కోల్పోయింది. అయితే చదువుకునేందుకు కళాశాలకు వెళ్లిన అమ్మాయి ఇలా ప్రమాదానికి గురై చనిపోవడాన్ని ఆమె తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోతున్నారు. అచేతనంగా పడి ఉన్న కూతురును చూస్తూ కన్నీరుమున్నీరవుతున్నారు. విశాఖపట్నం జిల్లా దువ్వాడ రైల్వే స్టేషన్‌లో బుధవారం ఉదయం 10 గంటలకు ప్రమాదం జరిగింది. రైలు దిగబోతుండగా ఓ యువతి ప్రమాదవశాత్తు జారి పడింది. దీంతో రైలుకు ప్లాట్ ఫాంకు మధ్య ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అమ్మాయిని అందులోంచి బయటకు తీసే ప్రయత్నం చేశారు. కానీ ఎంత ప్రయత్నించినా కుదరలేదు. దీంతో కూలీలను రప్పించి ప్లాట్ ఫాంను పగులగొట్టారు. ఇలా అమ్మాయిని బయటకు తీశారు. వెంటనే ఆమెను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన యువతి పేరు శశికళ. ఆమె కళాశాలకు వచ్చేందుకు గోపాలపట్నం నుంచి దువ్వాడకు వస్తోంది. ఈ క్రమంలోనే ప్రమాదం జరగడం.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఒక్కగానొక్క కుమార్తె మృతి చెందడంతో తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఇలాంటి కష్టం మరొకరికి రాకూడదని కోరుకుంటున్నారు.