Father Colombo Medical College: హన్మకొండలో నిర్మించిన ఫాదర్ కొలంబో వైద్య కళాశాలను మంత్రులు హరీశ్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు బస్వరాజు సారయ్య, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, అరూరి రమేష్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. ఫాదర్ కొలంబో కల నేడు నెరవేరిందని అన్నారు. ఉద్యమ సమయంలో నుండి తాను దీని గురించి వింటున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కుల, మతాలకు తేడా లేకుండా అందరికీ సమ అవకాశాలు ఇస్తుందన్నారు. 60 ఏళ్లలో 3 ప్రభుత్వ కాలేజీలు ఉంటే, 9 ఏళ్లలో 21కి చేర్చామన్నారు. అలాగే నాడు ప్రభుత్వ , ప్రైవేటులో మొత్తం 20 మెడికల్ కాలేజీలు ఉంటే నేడు 55కు చేరాయని చెప్పారు. ఎంబీబీఎస్ సీట్లు నాడు 2950 మాత్రమే ఉండగా.. నేడు 8340 సీట్లకు చేరిందని వివరించారు. వరంగల్ మూడు మెడికల్ కాలేజీలు ఉండే నగరం అయ్యిందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. తెలంగాణ రావడం, సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి కావడం వల్లే ఇదంతా సాధ్యమైందని అన్నారు. మెడికల్ కాలేజీ అంటే 500 పడకల ఆసుపత్రి వస్తుందని.. దీంతో ఇక్కడి వారికి ఉపాధి వస్తుందని స్పష్టం చేశారు. దీనివల్ల ప్రాంతం అభివృద్ధి జరుగుతుందని చెప్పుకొచ్చారు.
భూపాలపల్లి, జనగాంలో మెడికల్ కాలేజీలు వచ్చాయని మంత్రి హరీష్ రావు తెలిపారు. అలాగే ములుగులో మెడికల్ కాలేజీ వస్తుందన్నారు. ఉత్తర తెలంగాణకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు 1100 కోట్ల రూపాయలతో హెల్త్ సిటీ నిర్మాణం జరుగుతుందన్నారు. ఈ ఆసుపత్రి ద్వారా పేదలకు ఉచిత వైద్య సేవలు అందించాలని కోరుతున్నట్లు తెలిపారు. ప్రభుత్వం మీకు పూర్తి మద్దతుగా ఉందని. సీఎం కోసం మీరంతా ప్రార్థన చేస్తూ.. అండగా ఉండాలని సూచించారు. మంత్రి దయాకర్ రావు మాట్లాడుతూ... పాత మిషన్ ఆసుపత్రిని మించి కొలంబో ఆసుపత్రి పని చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. కొలంబో ఆస్పత్రి వాళ్లు ప్రజలకు ఉచితంగా, మంచి వైద్యం ఇస్తారని నమ్మకం తోనే ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు వచ్చారని చెప్పారు.