RTO Vehicle Registration: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు బుధవారం నిలిచిపోయాయి. ఉదయం నుంచి ఆర్టీఏ కార్యాలయాల్లో కార్యకలాపాలను ఆపేశారు. రవాణా శాఖ సర్సర్ డౌన్ అవడం వల్లే కార్యకలాపాలు నిలిచిపోయిన్ట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్ కావడం వల్ల ఆర్టీఏ వెబ్ సైట్ లో వాహనాలు, సేవల వివరాలు కనిపించడం లేదు. దీంతో స్లాట్ బుక్ చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ కోసం పడిగాపులు కాస్తున్నారు. సర్వర్ లో తలెత్తిన సాంకేతిక సమస్యను త్వరలోనే పునరుద్ధరించనున్నట్లు ఆ శాఖ అధికారులు వెల్లడించారు. 


అటు ఏపీలోనూ నిలిచిపోయిన భూముల రిజిస్ట్రేషన్లు


ఆంధ్రప్రదేశ్‌లో వరుసగా రెండో రోజూ భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. మరో రెండ్రోజుల్లో భూముల విలువ పెరుగుతూ వుండటంతో .. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. చలానాల ధర పెరగడంతో తమపై అధిక భారం పడుతుందని భావించి సామాన్యులు తమ భూముల క్రయ విక్రయాలు త్వరగా చేసుకోవాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది. సర్వర్లు మొరాయించడంతో  సోమవారం ఉదయం నుంచి భూముల రిజిస్ట్రేషన్ నిలిచిపోయింది. 2010కి ముందు రాష్ట్రంలో మాన్యువల్ పద్ధతిలోనే రిజిస్ట్రేషన్లు జరిగేవి.  


ఏపీలో భూముల ధరలు పెంచేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. జులై ఫస్ట్‌ నుంచి చాలా ప్రాంతాల్లో భూముల మార్కెట్ వ్యాల్యూ పెరగనుంది. దానికి సంబంధించి జిల్లాల జాయింట్ కలెక్టర్లు ధరలు నిర్థారిస్తూ జాబితా సిద్ధం చేశారు. గతేడాది జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఒకసారి మార్కెట్ ధరలు పెంచింది ఏపీ ప్రభుత్వం. జిల్లా కేంద్రాలతోపాటు డిమాండ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో రేట్లు హైక్‌ చేసింది. తాజాగా మరోసారి భూముల ధరలు పెంపునకు రెడీ అయింది. అయితే.. గతంలో ఎక్కడెక్కడ ధరలు పెంచలేదో ఆయా ప్రాంతాల్లో మాత్రమే ల్యాండ్‌ రేట్లు పెరగనున్నాయి. అందులోనూ.. డిమాండ్ ఎక్కువగా ఉన్న చోటే ధరలు పెంచబోతోంది ఏపీ సర్కార్.


భూముల రేట్ల పెంపు ఒక్కో జిల్లాలో, ఒక్కో ప్రాంతంలో వేర్వేరుగా ఉండనుంది. ఆయా ప్రాంతాల్లో అధికారుల నుంచి తీసుకున్న సమాచారం మేరకు జిల్లాల జాయింట్ కలెక్టర్లు కొత్త ధరలు జాబితా సిద్ధం చేశారు. కనీసం 30నుంచి గరిష్టంగా 70 శాతం వరకూ ధరలు పెరగనున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి.. గతేడాది జిల్లాల విభజన, భూముల ధరలు పెరుగుదలతో ఏపీ ప్రభుత్వానికి ఆదాయం దండిగా వచ్చింది. సుమారు 8 వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. నెలకు సగటున 700 కోట్లకు పైగా ఆదాయం వచ్చింది. ఈ క్రమంలోనే.. ఆదాయాన్ని మరింత పెంచుకునేలా ధరలు పెంపునకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు టాక్‌ నడుస్తోంది.


 ఏపీలోని రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో ఇటీవల తరచుగా సాంకేతిక సమస్యలు వస్తున్నాయి. తాజాగా.. మంగళవారం కూడా ఏపీలో రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. మరో రెండు రోజుల్లో భూముల ధరల పెంపునకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవడంతో ప్రజలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలకు క్యూ కట్టారు. అయితే.. రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని సర్వర్లు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు.