Warangal News: ఆరుగాలం శ్రమించి పండించిన పంటలను కాపాడుకునేందుకు ఎండకు ఎండి, వర్షానికి  తడిసిన రైతులు వారి పంటను కాపాడుకునేందుకు కోటి కష్టాలు పడుతున్నారు. తాను సాగు చేసే మిర్చి పంటకు ఇరుగు పొరుగు వారి  దిష్టి తగులకూడదని ఓ రైతు విచిత్ర ఆలోచన చేశాడు. స్థానిక ప్రజలందరి కళ్లు పంటపై కాకుండా అతను చేసిన ఆలోచనపై పడేలా ఓ పోస్టర్ ఏర్పాటు చేశాడు. హీరోయిన్ ఛార్మి ఫొటోను పంట చేల్లో పెట్టి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. అయితే ఈ ఘటన ఎప్పుడు, ఎలా జరిగిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. 




మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం భవానీ గడ్డ తండాలో ఓ రైతు ఈ ఆలోచన చేశాడు. తండాకు చెందిన  భూక్యా అచ్చు అనే రైతు తన రెండు ఎకరాల్లో ఎకరం పత్తి, మరో ఎకరం మిర్చి పంటను సాగు చేస్తున్నాడు. రైతు తన పంటకు దిష్టి తగలకుండా మాస్, రాఖీ సినిమాలతో మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న హీరోయిన్, ఆ తర్వాత వరుస ప్లాప్ లతో తన కెరీయర్ ను కొనసాగించలేక చిత్ర నిర్మాతగా మారిన ఛార్మి.. పోస్టర్ ను పొలంలో పెట్టుకున్నాడు. అయితే ఈ రైతు అభిమాన హీరోయిన్ ఛార్మి కావడంతో అందరి కళ్లు ఆమెపైనే పడేలా ఫ్లెక్సీని ఏర్పాటు చేశాడు. సాధారణంగా తోటలో దిష్టి కోసం గుమ్మడి కాయలు, దిష్టి యంత్రాలు, గడ్డితో తయారు చేసిన బొమ్మలు పెడుతుంటారు. 




కానీ  ఈ రైతు  మాత్రం వినూత్నoగా ఆలోచించి  హీరోయిన్ ఛార్మి ఫ్లెక్సీని పెట్టాడు. అటువైపుగా  వెళ్తున్న పాదాచారులను, ద్విచక్ర వాహనదారులు ఫోటోను ఆసక్తిగా గమనిస్తూ నవ్వుకుంటూ పోతున్నారు. కానీ పంట పొలాల్లో ఉన్న ఫొటోలు చూసిన యువకులు మాత్రం మంట పుట్టిస్తూ చంపేస్తున్నార్రా బాబు అంటూ కామెంట్లు చేస్తున్నారు. పంట పొలాల్లో ఉన్నాయి కాబట్టి సరిపోయింది. అదే రోడ్లమీద ఉంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని అన్నారు. 


నెల రోజు క్రితం కూడా ఇదే జిల్లాలో ఇలాంటి ఘటనే..! 


తన పంట పొలానికి దిష్టి తగాలకుండా ఉండేందుకు ఓ రైతు వినూత్న ఆలోచన చేశాడు. బాలీవుడ్ హాట్ బ్యూటీ, హీరోయిన్ సన్నీలియోన్‌ ఫొటోను పంట పొలంలో పెట్టాడు. వంరగల్ కు చెందిన ఓ రైతు తమ పంటకు దిష్టి తగలకుండా ఉండాలని...  సన్నీ లియోన్‌ ఫొటోను వెదురు కర్ర సహాయంతో పెట్టాడు. దీంతో దారి వెంట పోయేవాళ్ల కళ్లన్నీ బొమ్మపై మాత్రమే ఉండి ఇతరుల దృష్టి మరల్చే ప్రయత్నం చేశాడు.


సన్నీలియోన్ ఫోటో అడ్డు.. 


మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎల్లంపేట గ్రామంలో రైతు వినూత్న ఆలోచన తన మిరుప తోటకు దిష్టి తగలకుండా సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ ఏర్పాటు చేశాడు. ఎల్లంపేట గ్రామానికి చెందిన రైతు కొమురయ్య తనకు ఉన్న ఎకరం భూమిలో మిరుప తోట సాగు చేయగా.. గత ఏడాది  పంటకు దిష్టి తగిలి పెట్టుబడులు కూడా రాలేదు అని చెప్పాడు. అందుకే ఈసారి రోడ్డు పక్కన ఉన్న తన పంట పొలంపై రోడ్డు మార్గం గుండా వెళ్లే వారి చూపు తోటపై పడికుండా ఉంటుందని భావించి సన్నీ లియోన్ ఫ్లెక్సీనీ తోటలో ఏర్పాటు చేశాడు. దీంతో ఇతరుల చూపు ఫ్లెక్సీపై పడి తోట మెరుగు పడుతుంది అని రైతు కొమురయ్య అంటున్నాడు. దీంతో రైతు ఆలోచనకు పరిసర ప్రాంత రైతులు ఔరా అంటున్నారు.