Kothagudem News: అతనో సాఫ్ట్ వేర్ ఉద్యోగి. ఉన్నంతలో పిల్లాపాపలతో హాయిగా బతుకున్నాడు. అడిగిన వారికి లేదనకుండా సాయం చేసే గుణం కూడా ఉందతనికి. అదే అతని హత్యకు దారి తీసింది. తెలిసిన వాడు, అందులోనూ డబ్బుల అవసరం ఉండగా... అతను కొంత డబ్బును అప్పుగా ఇచ్చాడు. ఎన్ని రోజులు అవుతున్నా తిరిగి ఇవ్వకపోవడం, తనకూ డబ్బు అవసరం పడడంతో అతడిని అడగడం ప్రారంభించాడు. దీంతో కక్ష పెంచుకున్న అతడు మరో వ్యక్తి సాయంతో.. గొంతు, నరాలు కోసి మరీ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని హత్య చేశాడు.
అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వమనడం వల్లే..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం ముత్యాలంపాడు క్రాస్ రోడ్డు పంచాయతీలోని శాంతి నగర్ కు చెందిన బీజేపీ మండల అధ్యక్షుడు ధారావత్ బాలాజీ పెద్ద కుమారుడు ధారావత్ అశోక్ కుమార్(24) ఖమ్మంలోని ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. ఇతడికి భార్య అమల, రెండు నెలల పాప ఉంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుకు చెందిన గుగులోత్ ప్రేమ్ కుమార్ కు అవసరం అయినప్పుడు అశోక్ అప్పు ఇచ్చేవాడు. అలా ప్రేమ్ కుమార్ రూ.80 వేల వరకు బాకీ ఉన్నట్లు తెలిసింది. అతడి మధ్యవర్తిత్వంతో మరో వ్యక్తికి కూడా అశోక్ అప్పు ఇచ్చినట్లు సమాచారం. తన డబ్బు తిరిగి ఇవ్వాలని ఆశోక్ ఇద్దరినీ అడుగుతుండటంతో వారు ఇతడిపై కక్ష పెంచుకున్నారు. ఈ క్రమంలోనే అతడిని హత్య చేయాలనుకున్నారు. అందుకు ఓ అద్భుతమైన ప్లాన్ కూడా వేశారు.
గొంతు, చేతి, కాళ్ల నరాలన్నీ కోసి హత్య..
శనివారం రాత్రి డబ్బులు ఇస్తాం రమ్మని ప్రేమ్ కుమార్... అశోక్ కుమార్ కు చెప్పాడు. దీంతో అశోక్ కుమార్ తన ద్విచక్ర వాహనంపై ముత్యాలంపాడు క్రాస్ రోడ్డుకు చేరుకున్నాడు. నిందితులు పథకం ప్రకారం అశోక్ ను స్థానిక పంచాయతీ కార్యాలయంలోకి తీసుకెళ్లి గొంతు, చేతి మణికట్టు, కాలి చీలమండల నరాలు కోసి అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే తెల్లవారినా అశోక్ ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రాత్రి నుంచి తమ కుమారుడు కనిపించడం లేదని, ప్రేమ్ కుమార్ కు ఇచ్చిన అప్పు డబ్బులు తీసుకువచ్చేందుకు వెళ్లాడని చెప్పారు. అయితే తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
అప్పటికే స్థానికులు ఓ చోట మృతదేహం కనిపించిందని చెప్పగా.. ఇల్లెందు డీఎస్పీ రమణ మూర్తి సహా సిబ్బంది సంఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని పరిశీలించారు. బాలాజీ ఫిర్యాదుపై టేకులపల్లి సీఐ ఇంద్రసేనా రెడ్డి కేసు నమోదు చేశారు. ప్రేమ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. అశోక్ హత్యకు కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ బంధువులు ఆందోళన చేపట్టారు. ప్రేమ్ కుమార్ ఇంటిపై దాడి చేశారు. పోలీసులు వారిని శాంతింపజేశారు. హత్య చేసింది గంజాయి బ్యాచ్ పని అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. కొత్తగూడెం, ఖమ్మంకు చెందిన వారితోనే హత్య చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.