Sensor Hand Stick in Warangal: ఇదొక సెన్సార్ చేతి కర్ర. అంధులు రోజు వారి దినచర్యలో అనేక అవాంతరాలను ఎదుర్కొంటారు. చేతిలో బ్లైండ్ స్టిక్ ఉన్నా కూడా వారి ఎదుట ఏమి ఉందో తెలియదు. అయితే ఈ పాఠశాల విద్యార్థి అంధుల కోసం సెన్సార్ తో రూపొందించిన ప్రత్యేక చేతి కర్రను తయారు చేశాడు. ఇక్కడ కనిపిస్తున్నదే స్మార్ట్ బ్లైండ్ స్టిక్. వరంగల్ కు చెందిన మన్విత్ 5వ తరగతి చదువుతున్నాడు. అంధులు నడిచే సమయంలో పడుతున్న ఇబ్బందులకు చెక్ పెట్టడానికి మన్విత్ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ను రూపొందించాడు. 


అడినో బోర్డుకు కోడింగ్ చేసి ఆ కోడింగ్ ను అల్ట్రా సోనిక్ సెన్సార్ కు అనుసంధానం చేశాడు మన్విత్. కోడింగ్ లో 50 సెంటిమీటర్ల దూరం ఉండగానే అంధులు నడకలో ఎదురయ్యే అవాంతరాలను అలర్ట్ చేసే విధంగా ఈ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ పనిచేస్తుంది. ఆడినో బోర్డు, అల్ట్రా సోనిక్ సెన్సార్ పనిచేయడానికి హెచ్‌డబ్ల్యూ బ్యాటరీని అమర్చాడు. ఆడినో బోర్డు, అల్ట్రా సోనిక్ సెన్సార్, బ్యాటరీని బాక్స్ లో పెట్టి ఒక కర్రకు బిగించాడు. దీంతో అంధులు కర్రతో ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళవచ్చని మన్విత్ చెప్పాడు. అంధులు పడుతున్న సమస్యను చూసి ఈ స్మార్ట్ బ్లైండ్ స్టిక్ ను తయారు చేశానని చెప్పాడు. 


అంత చిన్న వయసులో బాలుడు ఈ ప్రయోగం చేసి చేతి కర్రను ఆవిష్కరించడం పట్ల అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ కర్ర పట్టుకొని వెళ్ళినప్పుడు 50 సెంటిమీటర్ల దూరంలో రాయి, ఇతర వస్తువులు ఉన్నప్పుడు సెన్సార్ గుర్తించి సౌండ్ చేస్తుంది.