వరంగల్: వరంగల్ లో రాష్ట్ర ప్రభుత్వం అధునాతన సదుపాయాలతో నిర్మిస్తున్న 24 అంతస్థుల నూతన మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులను సోమవారం నాడు రాష్ట్ర రోడ్లు-భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ తో కలిసి పరిశీలించారు. నిర్మాణ ప్రాంగణమంతా కలియ తిరిగారు. దేశంలో ఎక్కడ లేని విధంగా వరంగల్ లో 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. హాస్పిటల్ డిజైన్లు,వర్క్స్ ప్రోగ్రెస్ పరిశీలించారు. మూడు షిఫ్టుల్లో 24 గంటలు పనులు నిరంతరాయంగా జరగాలని అధికారులు, వర్క్ ఏజెన్సీని అదేశించారు. పనులు వేగంగా జరగాలని అందుకు తగ్గట్టుగా మ్యాన్ పవర్ పెంచాలని సూచించారు. పనుల పురోగతిపై మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. మొదటి అంతస్తు, కోర్ట్ యార్డ్, ఎలివేషన్ ఏరియా పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. 


ఈ సందర్భంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సదుపాయాలు అందాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. 24 అంతస్తుల మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నామని తెలిపారు. 42 ఎకరాల్లో, 19 లక్షల స్క్వేర్ ఫీట్ల విస్తీర్ణంలో సుమారు 1200 కోట్ల రూపాయలతో హాస్పిటల్ నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ హాస్పిటల్ వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, మహబూబాబాద్, ములుగు జిల్లాల ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ కార్పొరేట్ హాస్పిటల్లో ఏదైతే చికిత్స అందిస్తారో అదే స్థాయిలో వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉచితంగా మెరుగైన చికిత్స లభిస్తుందని తెలిపారు. ఒక్కో కార్పొరేట్ హాస్పిటల్ కొన్ని విభాగాల్లోనే ప్రత్యేక చికిత్స అందిస్తాయి. 
వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో 30 నుంచి 35 విభాగాల ట్రీట్మెంట్ సేవలు అందనున్నాయని తెలిపారు. పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, ఇప్పటికే హాస్పిటల్ నిర్మాణ స్ట్రక్చర్ పనులు 60శాతం పూర్తి అయ్యాయని, ఈ సెప్టెంబర్ నాటికి మొత్తం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. 2023 డిసెంబర్ నాటికి ఆస్పత్రిని పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మంత్రి వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఈ నిర్మాణ పనులు పర్యవేక్షిస్తున్నరని తెలిపారు. 


సీఎం కేసీఆర్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని హైదరాబాద్ చుట్టూ నాలుగు మల్టి స్పెషాల్టీ హాస్పటల్ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు. తూర్పు జిల్లాల నుంచి వచ్చే ప్రజలకు ఎల్బి నగర్ లో, ఉత్తర జిల్లాల నుంచి వచ్చే వారికి అల్వాల్ లో,సిటీలో సనత్ నగర్లో, మరో వైపు గచ్చిబౌలిలోని టిమ్స్ లలో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందేలా ఏర్పాటు చేస్తున్నట్లు వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. ఒక్కో హాస్పిటల్ 900 కోట్ల వ్యయంతో 1000 బెడ్ల సదుపాయంతో నిర్మిస్తున్నామన్నారు. నిమ్స్ హాస్పిటల్లో కూడా 1600 కోట్లతో కొత్తగా 2వేల పడకలు అందుబాటులోకి రానున్నాయని అన్నారు. 


కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం అందించకున్నా.. పేదల ఆరోగ్యం కోసం వైద్య రంగనాకి కేసిఆర్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. తెలంగాణకు కేంద్రం ఒక్క మెడికల్ కాలేజీ ఇవ్వకపోయినా అన్ని జిల్లాలో సీఎం కెసిఆర్ మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారని అన్నారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి వెంట ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, హనుమకొండ జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఆర్ అండ్ బి ఈఎన్సీ గణపతి రెడ్డి, ఎస్.ఈ నరేందర్ రావు, పలువురు అధికారులు, ఎల్ అండ్ టి నిర్మాణ సంస్థ ప్రతినిధులు తదితరులు ఉన్నారు.