Warangal Congress Politics :  ఓరుగల్లు కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కాంగ్రెస్ నేతలు నాయిని రాజేందర్ రెడ్డి, జంగా రాఘవరెడ్డి  బాహాబాహికి దిగారు. గతంలో పార్టీ పెద్దలముందే ముష్టియుద్ధాలకు దిగడంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఈ అంతర్గత వర్గపోరు తారాస్థాయికి చేరుకుంది.


కాంగ్రెస్ నుంచి నువ్వా ?నేనా?


తాజాగా వరంగల్ కాంగ్రెస్ లో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. గత ఏడాది మే 6న రాహుల్ వరంగల్ పర్యటనకు వస్తున్న నేపథ్యంలో సభ ఏర్పాట్లను పరిశీలించేందుకు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపేయినర్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పీసీసీ ప్రచార కమిటీ కార్యదర్శి మధుయాస్కీ గౌడ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు హనుమకొండ ఆర్ట్స్ కాలేజీకి వచ్చారు. కాంగ్రెస్ పెద్దల ముందే వరంగల్ డీసీసీ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి, జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిలు బలప్రదర్శనకు దిగారు. వీరి అనుచరులు పోటా పోటీ నినాదాలు చేసుకున్నారు. ఒక దశలో తోపులాట జరిగి అనుచరులు బాహాబాహికి దిగారు. పీసీసీ అధ్యక్షుడు ముందే కాంగ్రెస్ అంతర్గతకుమ్ములాటలు రచ్చకెక్కాయి. దీంతో పార్టీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. తాజాగా ఇప్పుడు ఒక్కరిపై ఒక్కరు విమర్శలు చేసుకొని పొలిటికల్ సర్కిల్ లో చర్చగా మారారు.


పశ్చిమ సీటు నాది అంటే నాది?


 గత కొంతకాలంగా జంగా రాఘవరెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయి. వరంగల్ పశ్చిమ సీటు నాదంటే నాదంటూ పోటాపోటీ ప్రకటనలు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో పోటీ పడి మరీ పర్యటనలు చేస్తున్నారు. ఎలాగైనా ఈసారి నేనే పోటీ చేస్తానని అనుచరులకు చెబుతూవస్తున్నారు.


జంగాపై సస్పెన్షన్ వేటు


వరంగల్  ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ లో కల్లోలం చెలరేగింది. మాజీ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా ఆరోపిస్తూ.. అధిష్టానం ఆదేశాల మేరకు ఆ పార్టీ క్రమశిక్షణ చర్యలు చేపట్టింది. ఈ మేరకు జంగా రాఘవరెడ్డి కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక రద్దు, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు.


జనగామ కాంగ్రెస్ అధ్యక్షుడు హన్మకొండలో పాదయాత్ర ఏంటి? 


జనగామ జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షుడిగా ఉండి హనుమకొండలో పాదయాత్రలు, పార్టీ కార్యక్రమాలు చేయడంపై పార్టీ సీరియస్ అయినట్టు తెలుస్తోంది. వరంగల్ పశ్చిమ నుంచి పోటీ చేస్తున్నానని తనకు తానే జంగా రాఘవరెడ్డి ప్రకటించుకోవడంతో వివాదం తెరపైకి వచ్చినట్టు రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ ప్రాథమిక సభ్యత్వం రద్దు చేసి, పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు ప్రకటించినట్లు హనుమకొండ డీసీసీ ప్రెసిడెంట్ నాయిని రాజేందర్ రెడ్డి వెల్లడించారు. 


పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కష్టపడాల్సిన సమయంలో ఇలా అంతర్గత విభేదాలతో కాంగ్రెస్ నేతలు రచ్చకెక్కడంతో ఆ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు.