నలుగురు ఎమ్మెల్యేలపై వైసీపీ వేటు వేసింది. ఆ నలుగురిపై డబ్బులు తీసుకున్నారనే అపవాదు కూడా వేసింది. ఇదంతా సీఎం జగన్ ఆదేశాల ప్రకారమే జరిగింది. అయితే ఈ ఎపిసోడ్ లో ఆ ఎమ్మెల్యేలకు ఉమ్మడిగా టార్గెట్ అయింది మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి మాత్రమే. ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న సజ్జల ఇప్పుడు అంతా తానై పార్టీని నడిపిస్తున్నట్టుగా వ్యవహారం ఉంది. విజయసాయిరెడ్డి ప్రాధాన్యం పార్టీలో తగ్గిన తర్వాత సజ్జల ఆల్ ఇన్ వన్ అయ్యారు. పార్టీ తరపున ఏది మాట్లాడాలన్నా ఆయనే, ఎవరు జగన్ దగ్గరకు వెళ్లాలన్నా ముందు సజ్జలను దాటాలి. ఏ విభాగంలో సమస్యలు వచ్చినా సజ్జలే ట్రబుల్ షూటర్. అలాంటి ట్రబుల్ షూటర్ నే టార్గెట్ చేశారు అసమ్మతి ఎమ్మెల్యేలు.
కోటంరెడ్డి గతంలోనే..
కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గతంలోనే సజ్జలను టార్గెట్ చేశారు. తనని ఫోన్లో తిట్టించింది కూడా సజ్జలేనని అన్నారు. ఆయన ఆదేశాలతోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం జరిగిందన్నారు. కాకాణికి మంత్రి పదవి ఇచ్చే క్రమంలో వారిద్దరి మధ్య లాలూచీ నడిచిందని, తనను కావాలనే పక్కనపెట్టారని కూడా ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి తనయుడి పేరు కూడా తెరపైకి తెచ్చారు కోటంరెడ్డి. తాజాగా సస్పెన్షన్ వేటు పడిన తర్వాత కూడా సజ్జల రామకృష్ణారెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు కోటంరెడ్డి. ఆయన్ను ఎన్నికల కమిషన్ విచారించాలన్నారు. రహస్య ఓటింగ్ గురించి సజ్జలకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. తమకు డబ్బులు ముట్టాయని అంటున్ను సజ్జల, టీడీపీ ఎమ్మెల్యేలకు ఎంతెంత ముట్టజెప్పారని ప్రశ్నించారు.
ఆయన సంగతి నాకు బాగా తెలుసు..
సజ్జల జర్నలిస్ట్ గా ఉన్నప్పటి నుంచి ఆయన సంగతి తనకు బాగా తెలుసన్నారు మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ఇప్పుడు ఆయన వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యారని ప్రశ్నించారు. అందరూ ఆయన లాగే డబ్బులు తీసుకుంటారనుకోవడం సజ్జలకు సరికాదని హితవు పలికారు. తమపై వేసిన అపవాదులపై న్యాయపోరాటం చేస్తామన్నారు ఆనం. ఈ వ్యవహారంలో ఆయన సజ్జలకు తీవ్రంగా తప్పుబట్టారు.
నాకేమైనా జరిగితే దానికి సజ్జలదే బాధ్యత..
ఏపీలో తనకు ప్రాణహాని ఉందని, అందుకే అక్కడికి రాలేకపోతున్నానని అన్నారు సస్పెన్షన్ కి గురైన మరో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి. ప్రజలే తన కుటుంబం అనుకుని కష్టపడ్డానని, ఇంత దారుణంగా సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారామె. తాను డబ్బులు తీసుకోలేదని, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేయలేదని, అమరావతి మట్టి మీద ప్రమాణం చేస్తానన్నారు. ఏ గుడిలో అయినా ప్రమాణం చేసేందుకు సిద్ధం అని చెప్పారు. తన ప్రాణాలకు హాని జరిగితే సజ్జలదే బాధ్యత అని అన్నారు ఉండవల్లి శ్రీదేవి. తనకు ఇప్పటికే బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, వాటన్నిటికీ పార్టీదే బాధ్యత అన్నారు. ముఖ్యంగా సజ్జలన తమను టార్గెట్ చేశారని చెప్పారు శ్రీదేవి.
ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి నేరుగా జగన్ ని టార్గెట్ చేశారు. ఆయన్ను నమ్ముకున్న మేకపాటి కుటుంబానికి జగన్ ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నించారు. సజ్జల విషయంలో చంద్రశేఖర్ రెడ్డి పెద్దగా రెస్పాండ్ కాలేదు కానీ, జగన్ నే ఆయన టార్గెట్ చేశారు. సస్పెండ్ అయిన మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా సజ్జలను టార్గెట్ చేశారు. ఆయన వల్లే ఇదంతా జరిగిందని, జగన్ కి తప్పుడు సలహాలిస్తున్నారని, తమని వేధించారని, బయటకు పంపించారని అంటున్నారు ఎమ్మెల్యేలు. జగన్ కోసమే ఈ నిందలన్నిటినీ సజ్జల భరిస్తున్నారా, లేక అసలిదంతా సజ్జల స్క్రిప్టేనా తేలాల్సి ఉంది.