Thatikonda Rajaiah vs Kadiyam Srihari: వరంగల్: తెలంగాణలో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. పలు జిల్లాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఈ క్రమంలో ఆ ఇద్దరు మాజీ డిప్యూటీ సీఎంలు, కానీ ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఓవైపు ప్రతిపక్షాలు ఊపిరి సలపని విధంగా విమర్శలు, ఆరోపణలతో అటాక్ చేస్తుంటే.. మరోవైపు సొంత పార్టీలోనే వేరు వేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు అధికార బీఆర్ఎస్ నేతలు. తాజాగా వరంగల్ జిల్లా స్టేషన్ ఘణపూర్‌లో ఎమ్మెల్యే రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మధ్య డైలాగ్స్ వార్ కంటిన్యూ అవుతోంది.
దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు
కడియం శ్రీహరి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య ఇన్‌డైరెక్ట్‌గా కౌంటర్ ఇవ్వడం చర్చనీయాంశమైంది. నియోజకవర్గంలో దళిత బంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరుగుతున్నాయని కడియం ఆరోపించగా.. చిల్లర మాటలు నమ్మవద్దంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే రాజయ్య. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారిని ఆర్థిక చేయూత కల్పించేందుకు, సమాజంలో వారు మరో అడుగు ముందుకు వేసేందుకు దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ తీసుకొచ్చారు. ఇప్పటికే పలు జిల్లాల్లో దళిత బంధు నిధులు విడుదల చేసి అర్హులైన లబ్ధిదారులను అందించారు. కొన్ని యూనిట్లుగా మారి సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. కొన్ని చోట్ల పైలట్ ప్రాజెక్టుగా నిధుల పంపిణీ జరుగుతోంది.
ప్రజా ప్రతినిధుల బంధువులకు దళితబంధు నిధులు !
ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఎమ్మెల్సీ కడియం శ్రీహరి.. కొందరు ప్రజా ప్రతినిధులు వాళ్ల బంధువులకు దళితబంధు నిధులు ఇవ్వడం, లేదంటే లబ్ధిదారుల దగ్గర డబ్బులు తీసుకోవడం లాంటివి చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. సీఎం కేసీఆర్ ఎస్సీల కోసం తీసుకొచ్చిన పథకం దళిత బంధు అద్భుతమైన పథకం అని, కానీ కొందరు ఆ పథకాన్ని నీరు గార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని కడియం చెప్పారు .
అయితే, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి చేసిన ఆరోపణలపై ఎమ్మెల్యే రాజయ్య పరోక్షంగా ఘాటుగా స్పందించారు. ఆయన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దళిత బంధు పథకం, నిధుల విషయంలో చిల్లర మాటలు మాట్లాడవద్దనీ.. భాష మార్చుకోవాలని పరోక్షంగా కడియం శ్రీహరిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు రాజయ్య. దీంతో స్టేషన్ ఘణపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేనే సుప్రీం అని తేల్చి చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యే ద్వారానే లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయన్నారు. సీఎం కేసీఆర్ దగ్గర కూడా స్పెషల్ కోటా అంటూ ఏమీ లేదని, ఉన్నది ఒకటే ఒక కోటా అదే ఎమ్మెల్యే కోటా అన్నారు ఎమ్మెల్యే రాజయ్య. గాడిదకు గడ్డేసి ఆవుకు పిండితే పాలు రావు అంటూ సెటైర్ కూడా వేశారు. ఇలా ఒకే పార్టీలో ఉన్న ఈ ఇద్దరు నేతలు, అది కూడా డిప్యూటీ సీఎంగా సేవలు అందించిన బీఆర్ఎస్ నేతలు రాజయ్య, కడియం శ్రీహరి ఇలా ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకోవడంతో స్థానిక క్యాడర్‌కు ఏం చేయాలో తెలియని పరిస్థితులు ఎదురవుతున్నాయి.