వరంగల్ మెడికల్ కాలేజీలో ఆత్మహత్య చేసుకున్న పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతి కేసులో ఆమె వాడిన హానికర ఇంజక్షన్ ఏంటనేది ఇంకా తేలడం లేదు. ఆమె మరణించి వారం రోజులు గడిచినా ఈ విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. తాజాగా వెలువడిన టాక్సికాలజీ రిపోర్టులోనూ విష రసాయనాలు ఏం లేవని వచ్చింది. గుండె, కాలేయంతో పాటు, ఇతర అవయవాల్లో ఏ ఆనవాళ్లు లేవని నివేదిక వచ్చింది. దీంతో నేడు (మార్చి 6) వరంగల్ సీపీ రంగనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. టాక్సికాలజీ రిపోర్టుతో ఏమీ తేలదని, పోస్టు మార్టం రిపోర్టు వస్తే అన్ని విషయాలు బయటపడే అవకాశం ఉందని చెప్పారు. ఇందుకు మరో రెండు రోజులు సమయం పడుతుందని వెల్లడించారు. ఆ తర్వాత ప్రీతి మరణం గురించి అన్ని విషయాలు తెలుస్తాయని చెప్పారు. ప్రీతి కేసులో చర్చించేందుకు వరంగల్ సీపీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఇప్పటికే డీజీపీ కూడా ఆయనకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు.


హత్య అని కుటుంబం వాదన
మరోవైపు, ప్రీతి కుటుంబ సభ్యులు మాత్రం ఆమెది హత్య అనే అంటున్నారు. తాజాగా ప్రీతి సోదరుడు పృథ్వీ కూడా స్పందించాడు. ఓ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ప్రీతికి నిమ్స్‌లో బ్లడ్ డయాలసిస్ చేసి, ప్లాస్మా కూడా చేశారని అన్నాడు. దీనివల్లే టాక్సికాలజీ రిపోర్టులో విష పదార్థాలు ఏమీ లేవని వచ్చిందని అన్నాడు. శరీరం మొత్తం క్లీన్ చేసి రిపోర్టు తీస్తే టాక్సికాలజీ రిపోర్టులో ఏమీ రాదని చెప్పారు. గవర్నర్ తమిళిసై ప్రీతిని చూసేందుకు రాకముందే డయాలసిస్ చేశారని చెప్పారు. తమకు తెలియని విషయాలు గవర్నర్ కు చెప్పారని, ప్రీతి కళ్లకు టేప్  కూడా వేశారని చెప్పారు. ఈ కేసులో తమకు ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పారు. మరోవైపు తన కూతురిది ఆత్మహత్య కాదని, ముమ్మాటికి హత్యేనని ప్రీతి తండ్రి ధరావత్​ నరేందర్ ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు.


ఫిబ్రవరి 22న ప్రీతి ఆత్మహత్యకు పాల్పడగా, 26న ప్రీతి మరణించిన సంగతి తెలిసిందే. ఆమె హానికారక ఇంజెక్షన్‌ ఎక్కించుకున్నట్లుగానే వైద్యులు ప్రాథమికంగా నిర్ధారించారు. మొదట వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స చేసిన డాక్టర్లు, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమె ఆరోగ్య స్థితిని బట్టి, వెంటిలేటర్‌పై తర్వాత ఎక్మోపై ఉంచి కూడా వైద్యం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. గత నెల 26న రాత్రి 9.10 గంటలకు ప్రీతి మరణించినట్లు నిమ్స్ డాక్టర్లు ప్రకటించారు. 


విచారణలో నిందితుడు సైఫ్
ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్‌ను పోలీసులు వివిధ కోణాల్లో విచారణ చేశారు. సైఫ్ ప్రీతిని హత్య చేసి ఆత్మహత్య చేసుకున్న విధంగా చిత్రీకరించాడా అనే కోణంలోనూ విచారణ చేశారు. నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుతో పాటు ర్యాగింగ్ యాక్ట్ కింద కూడా కేసులు నమోదు చేశారు. ప్రీతి ఆత్మహత్య వ్యవహారంలో ఆమెను సైఫ్ మానసికంగా వేధింపులకు గురి చేయడం నిజమేనని ర్యాంగింగ్ నిరోధక కమిటీ పేర్కొంది. ప్రీవెంట్ అనస్థీషియా నివేదిక విషయంలో జరిగిన ఒక వివాదం ఒక్కటే వీరి మధ్య వివాదానికి కారణం కాదని తెలిపింది. వీరిద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చిన అనస్థీషియా వైద్య విభాగం చీఫ్ నాగార్జునరెడ్డి కూడా సైఫ్ ​ది తప్పేనని అంగీకరించారు. దీంతో నాగార్జున రెడ్డిని భూపాలపల్లి మెడికల్ కాలేజీ ప్రొఫెసర్ ​గా ట్రాన్స్‌ఫర్ చేశారు.


ముగిసిన సైఫ్ కస్టడీ
మెడికల్ స్టూడెంట్ ప్రీతి ఘటనలో సైఫ్ పోలీస్ కస్టడీ ముగిసింది. అడిషనల్ సెషన్స్ మెజిస్ట్రేట్ ముందు సైఫ్ ను పోలీసులు హాజరుపర్చారు. కస్టడీ పొడిగింపు కోసం పిటిషన్ దాఖలు చేయగా, మెజిస్ట్రేటు కేసును రేపటికి వాయిదా వేసింది. దీంతో సైఫ్ ను ఖమ్మం జైలుకి తరలించారు.