Inter Student dies of Heart Attack: తెలుగు రాష్ట్రాల్లో వరుస గుండెపోటు మరణాలు నమోదవుతున్నాయి. చిన్నా పెద్దా అనే వయసు వ్యత్యాసం లేకుండా చిన్ని గుండెలు ఒక్కసారిగా ఆగిపోతున్నాయి. ముఖ్యంగా తెలంగాణలో గత రెండు వారాల నుంచి ఏదో చోట చిన్న వయసులోనే గుండెపోటు మరణాలు సంభవిస్తున్నాయి. తాజాగా మరో విషాదం జరిగింది. అప్పటివరకూ స్నేహితులతో మాట్లాడుతున్న ఇంటర్ విద్యార్థి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆసుపత్రికి తరలించేలోగా అతడు మృతి చెందాడు. ఖమ్మం జిల్లాలో ఈ ఘటన జరిగింది.


అసలేం జరిగిందంటే..
ఖమ్మం జిల్లా బోనకల్లు మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన మరీదు రాకేష్ వయసు 18 ఏళ్లు. మధిర పట్టణంలోని ఓ ప్రైవేటు కళాశాలలో రాకేష్ ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఆదివారం నాడు తన ఇంటి ఆవరణలో స్నేహితులతో సరదాగా గడుపుతున్నాడు. ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ రాకేష్ ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్నేహితులు, కుటుంబసభ్యులు రాకేష్ ను మధిరలోని ఓ ఆసుపత్రికి తరలించారు. కానీ ప్రయోజనం లేకపోయింది. రాకేష్ ను పరీక్షించిన వైద్యులు అప్పటికే అతడు చనిపోయాడని నిర్ధారించారు. డాక్టర్ చెప్పిన విషయాన్ని రాకేష్ కుటుంబసభ్యులు జీర్ణించుకోలేక కన్నీటి పర్యంతమయ్యారు. అప్పటివరకూ తమతో సరదాగా గడిపిన స్నేహితుడు ఇక లేడని తోటి విద్యార్థులు కన్నీళ్లతోనే హాస్పిటల్ నుంచి తిరిగి వెళ్లిపోయారు. 40, 50 ఏళ్లు కాదు కదా, కనీసం 20 ఏళ్లు కూడా నిండని వారు హఠాన్మరణం చెందడం ప్రజలను భయాందోళనకు గురి చేస్తోంది. మరోవైపు దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు లాంటి సమస్యలు పది మందిలో ముగ్గురి నుంచి నలుగరిలో కనిపిస్తున్నాయి.


గుండెపోటుతో కుప్పకూలిపోయి బీటెక్ విద్యార్థి మృతి


హైదరాబాద్ నగరంలో మరో విషాదం చోటుచేసుకుంది. ఛాతీలో నొప్పి రావడంతో కుప్పకూపోయిన ఓ విద్యార్థి నిమిషాల వ్యవధిలో కన్నుమూశాడు. మేడ్చల్ లోని సీఎంఆర్ కాలేజీలో ఈ విషాద ఘటన జరిగింది. అప్పటివరకూ తోటి విద్యార్థులతో ఎంతో సరదాగా గడిపాడు. కానీ కాలేజీ ఆవరణలో విద్యార్థి విశాల్ ఛాతీలో నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన తోటి విద్యార్థులు, కాలేజీ సిబ్బంది ఆ విద్యార్థిని ఆస్పత్రికి తరలిస్తుండగా అప్పటికే జరగరాని నష్టం జరిగిపోయింది. మార్గం మధ్యలోనే ఆ విద్యార్థి మృతి చెందాడు.


ఇంజినీరింగ్ ఫస్టియర్ చదువుతున్న రాజస్థాన్ కి చెందిన‌‌ విద్యార్థి విశాల్ ఆకస్మిక మరణంతో వారి ఇంట్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. మేడ్చల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అయితే కుప్పకూలిన వెంటనే విశాల్ కు సీపీఆర్ చేశారా లేదా అనే దానిపై స్పష్టత లేదు. వరుస గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్ మరణాలు నమోదు కావడం నగరవాసులతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.


పాఠాలు చెబుతూనే ఆగిన ఉపాధ్యాయుడి గుండె- హార్ట్‌ స్ట్రోక్‌కు మరొకరరు బలి! 
బాపట్ల జిల్లా చీరాల మండలంలో ఓ ఉపాధ్యాయుడు పాఠాలు చెబుతూనే మృతి చెందాడు. వాకావాకా వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ ఘటన జరిగింది. ఉదయం బడికి హుషారుగా వచ్చిన టీచర్‌ పాఠాలు చెబుతూనే గుండె ఆగిపోయింది. ఆయన కుర్చున్న చోటే కూలబడిపోయి కన్నుమూశారు. వెంటనే స్పందించిన స్థానికులు ఆయన్ని ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. అప్పటికే ఆయన మృతి చెందినట్టు వైద్యులు చెప్పారు. దీంతో ఉపాధ్యాయుడితోపాటు పాఠశాల ఉన్న ఊరిలో కూడా విషాదఛాయలు అలుముకున్నాయి.