RCBW vs DCW:
విమెన్ ప్రీమియర్ లీగులో దిల్లీ క్యాపిటల్స్ బోణీ కొట్టింది. స్టార్లతో నిండిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును చిత్తుచిత్తుగా ఓడించింది. 224 పరుగుల భారీ టార్గెట్ ఛేదనకు దిగిన ప్రత్యర్థిని గజగజా వణికించింది. కేవలం 163/8 స్కోరుకే పరిమితం చేసింది. 60 పరుగుల తేడాతో విజయ దుందుభి మోగించింది. పదునైన బౌలింగ్‌తో టారా నోరిస్ (5/29) ప్రత్యర్థి పతనాన్ని శాసించింది. ఆర్సీబీలో స్మృతి మంధాన (35; 23 బంతుల్లో 5x4, 1x6), హీథర్ నైట్ (34; 21 బంతుల్లో 2x4, 2x6), ఎలిస్ పెర్రీ (31; 19 బంతుల్లో 5x4) టాప్ స్కోరర్లు. అంతకు ముందు డీసీలో షెఫాలీ వర్మ (84; 45 బంతుల్లో 10x4, 4x6), మెగ్ లానింగ్ (72; 43 బంతుల్లో 14x4) నాటు కొట్టుడు కొట్టారు. మారిజాన్ కాప్ (39*; 17 బంతుల్లో 3x4, 3x6), జెమీమా (22*; 15 బంతుల్లో 3x4, 0x6) మెరుపులు మెరిపించారు.
బాబోయ్ నోరిస్!
కొండంత లక్ష్య ఛేదనకు దిగిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు శుభారంభమే దక్కింది. ఓపెనర్లు స్మృతి మంధాన, సోఫీ డివైన్ (14) తొలి వికెట్‌కు 41 పరుగుల భాగస్వామ్యం అందించారు. మంధాన చూడచక్కని బౌండరీలు, సిక్సర్లతో అలరించింది. ఆమె భాగస్వామి సైతం ఫోర్లు బాదేయడంతో పవర్ ప్లే ముగిసే సరికి స్కోరు 54/1కి చేరుకుంది. స్ట్రాటెజిక్ టైమ్‌ఔట్ తర్వాత ఆర్సీబీకి అస్సలు కలిసి రాలేదు. స్పిన్నర్ అలిస్ కాప్సీ 4.2వ బంతికి డివైన్, 6.3వ బంతికి స్మృతిని పెవిలియన్‌కు పంపించేసింది. ఒత్తిడి పెరిగినా ఎలిస్ పెర్రీ కొన్ని మంచి షాట్లు ఆడింది. స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లింది. అయితే టారా నోరిస్ బౌలింగ్‌కు రావడంతో బెంగళూరు పతనం మొదలైంది. జట్టు స్కోరు 89 వద్ద పెర్రీ, 90 వద్ద దిశా (9), 93 వద్ద రిచా (2), కనిక (0)ను వరుసగా పెవిలియన్‌కు పంపించింది. మరో 3 పరుగులకే శోభన ఆశ (2)ను శిఖా పాండే ఔట్ చేసింది. ఆఖర్లో మేఘాన్ షూట్ (30*; 19 బంతుల్లో 5x4) అండతో హీథర్‌నైట్ కొన్ని చక్కని షాట్లు బాదేసి స్కోరును 150కి చేర్చింది. అప్పుడే ఆమెను ఔట్ చేసి నోరిస్ ఐదో వికెట్ దక్కించుకొని మ్యాచ్‌ను ముగించింది.
షెఫాలీ, లానింగ్ విధ్వంసం
బ్రబౌర్న్ మైదానం.. ఫ్లాట్ పిచ్.. చిన్న బౌండరీలు! లెంగ్తులు కుదరని బౌలింగ్! ఇంకేముంది టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన దిల్లీ క్యాపిటల్స్ పండగ చేసుకుంది. ఓపెనర్లు షెఫాలీ వర్మ, మెగ్ లానింగ్ నువ్వా నేనా అన్నట్టు పోటీపడి మరీ చితక బాదేశారు. షెఫాలీ ఆకాశమే హద్దుగా చెలరేగితే లానింగ్ బంతుల్ని నేలకు ముద్దాడేలా బౌండరీలకు పంపించింది. దాంతో పవర్ ప్లే ముగిసేసరికే డీసీ 57 పరుగులు చేసింది. ధాటికి తట్టుకోలేక ఆర్సీబీ వెంటనే స్ట్రాటజిక్ టైమ్ ఔట్ తీసుకుంది.
విరామం తర్వాతా డీసీ దూకుడు ఆగలేదు. షెఫాలీ 31 బంతుల్లో, లానింగ్ 30 బంతుల్లో హాఫ్ సెంచరీలు అందుకోవడంతో జట్టు స్కోరు 9.4 ఓవర్లకు 100, 13.4 ఓవర్లకు 150 చేరుకుంది. 162 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం అందించిన ఈ జోడీని 13.3వ బంతికి లానింగ్‌ను ఔట్ చేయడం ద్వారా హేథర్ నైట్ విడదీసింది. మరో బంతి వ్యవధిలోనే షెఫాలీని పెవిలియన్ పంపించేసింది. దాంతో త్రుటిలో సెంచరీ చేజార్చుకుంది. ఓపెనర్లు అందించిన మెరుపు ఓపెనింగ్‌తో మిగతా బ్యాటర్లూ రెచ్చిపోయారు. దక్షిణాఫ్రికా ఆల్‌రౌండర్ మారిజానె కాప్, టీమ్‌ఇండియా రాక్‌స్టార్ జెమీమా రోడ్రిగ్స్ సిక్సర్లు, బౌండరీలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. 18.2 ఓవర్లకే స్కోరు 200 దాటించారు. వీరిద్దరూ 31 బంతుల్లో 60 పరుగుల అజేయ భాగస్వామ్యం నెలకొల్పడంతో డీసీ స్కోరు 223/2కు చేరుకుంది.