Beth Mooney GG: 


గుజరాత్‌ జెయింట్స్‌కు వరుస దెబ్బలు తగులుతున్నాయి! విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభ మ్యాచులో ఘోరంగా ఓడిపోయింది. ఇప్పుడు ఆ జట్టు సారథి బెత్‌మూనీ (Beth Mooney) ఆడటం అనుమానంగా మారింది. సీజన్‌ మొత్తానికీ ఆమె దూరమయ్యే ప్రమాదం పొంచివుంది. ఆమె స్థానంలో స్నేహ్‌రాణాను తాత్కాలిక సారథి ఎంపిక చేస్తారని సమాచారం.


ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న విమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (Women Premier League) మార్చి 4న అంగరంగ వైభవంగా మొదలైంది. బాలీవుడ్‌ తారలు అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చారు. ఆ తర్వాత ముంబయి ఇండియన్స్‌ (Mumbai Indians), గుజరాత్‌ టైటాన్స్‌ (Gujarat Giants) తలపడ్డాయి. టాస్‌ గెలిచిన గుజరాత్‌ కెప్టెన్‌ బెత్‌మూనీ మొదట బౌలింగ్‌ ఎంచుకుంది. అయితే వారికి పరిస్థితులు ఏమాత్రం అనుకూలించలేదు. బౌలర్లు మొదట సరిగ్గా బౌలింగ్‌ చేయలేదు. ఫీల్డర్లు మిస్‌ ఫీల్డింగ్‌ చేశారు. దాంతో ముంబయి 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది.
 
చరిత్రాత్మక ఛేదనకు దిగిన గుజరాత్‌కు శుభారభమే దక్కలేదు. వరుస వికెట్లు చేజార్చుకొని 143 పరుగులకు ఆలౌటైంది. జట్టులోనే అత్యంత కీలకమైన బెత్‌ మూనీ కేవలం మూడు బంతులే ఎదుర్కొంది. ఓ పరుగు కోసం ప్రయత్నించి వెనక్కి వచ్చిన ఆమెకు పిక్క కండరాలు పట్టేశాయి. కాలి మడమ బెణికింది. దాంతో రిటైర్డ్‌ హర్ట్‌గా డగౌట్‌కు వెళ్లింది. ఆ తర్వాత ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఎలాంటి అప్‌డేట్‌ రాలేదు.


గుజరాత్‌ జెయింట్స్‌ ఆదివారం రెండో మ్యాచులో యూపీ వారియర్స్‌తో తలపడాల్సి ఉంది. ఈ మ్యాచుకు బెత్‌మూనీ అందుబాటులో ఉండటం లేదని తెలిసింది. బహుశా ఆమె టోర్నీ మొత్తానికే దూరమవుతుందని కొన్ని వర్గాల సమాచారం. స్నేహ్‌ రాణా (Sneh Rana) జట్టుకు సారథ్యం వహించనుందని అంటున్నారు. డబ్ల్యూపీఎల్‌లో ఆస్ట్రేలియా అమ్మాయిల కోసం గుజరాత్‌ భారీగా ఖర్చు పెట్టింది. బెత్‌మూనీని 350,000 డాలర్లు, యాష్లే గార్డ్‌నర్‌ను 558000 డాలర్లు పెట్టి కొనుగోలు చేసింది. జార్జియా వారెహమ్‌, అనబెల్‌ సుథర్‌లాండ్‌నూ ఎంచుకున్నారు.


Gujarat Giants vs Mumbai Indians Women, WPL 2023: మహిళల ప్రీమియర్ లీగ్ మొదటి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ జట్టు భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ మహిళల జట్టు 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా గుజరాత్ జెయింట్స్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయ్యారు. ముంబై తరఫున మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (65: 30 బంతుల్లో, 14 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచింది.


చుక్కలు చూపించిన ముంబై బౌలర్లు
208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ జెయింట్స్‌కు ఈ మ్యాచ్‌లో అస్సలు ఏదీ కలిసి రాలేదు. మొదటి ఓవర్లోనే కెప్టెన్, ఓపెనర్ బెత్ మూనీ (0: 3 బంతుల్లో) రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగింది. అదే ఓవర్లో వన్ డౌన్ బ్యాటర్ హర్లీన్ డియోల్ (0: 2 బంతుల్లో) కూడా అవుట్ అయింది. ఆ తర్వాత కూడా గుజరాత్ వికెట్లు కోల్పోతూనే ఉంది.


ఒక దశలో కేవలం 23 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోయింది. దీంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు సాధించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (49) రికార్డు బద్దలవుతుంది అనుకున్నారు. కానీ దయాళన్ హేమలత (29 నాటౌట్: 23 బంతుల్లో, ఒక ఫోర్, రెండు సిక్సర్లు) టెయిలెండర్లతో కలిసి పోరాడి ఆ అవమానాన్ని మాత్రం తప్పించగలిగింది. ఆఖర్లో టెయిలెండర్లు కూడా వరుసగా అవుట్ కావడంతో గుజరాత్ 15.1 ఓవర్లలో 64 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబై బౌలర్లలో సైకా ఇషాక్ కేవలం 11 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీసుకుంది.