స్మార్ట్ సిటీ పనుల శరవేగంగా పూర్తి చేయండి: మేయర్ గుండు సుధారాణి , కలెక్టర్ ఇంచార్జ్ కమిషనర్ ప్రావిణ్య.
- కొత్తవాడ జంక్షన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం, మగ్గం ఏర్పాటుకు ఆదేశాలు..
- పనుల పురోగతిపై బల్దియా, ఇరిగేషన్, విద్యుత్, కుడా అధికారులు, గుత్తేదారులతో సమీక్ష
గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను శరవేగంగా పూర్తి చేయాలని నగర మేయర్ గుండు సుధారాణి (Warangal Mayor Gundu Sudharani), కలెక్టర్ ఇంఛార్జ్ జిడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావిణ్యలు ఆదేశించారు. బుధవారం హన్మకొండ లోని కుడా మీటింగ్ హాల్ లో బల్దియా ఇరిగేషన్, విద్యుత్, కూడా అధికారులు గుత్తేదారులతో నగరంలో స్మార్ట్ సిటీ పథకం కింద కొనసాగుతున్న పనులపై సమీక్షించి నాణ్యతతో సకాలంలో పూర్తి చేయుటకు పలు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా మేయర్ గుండు సుధారాణి, ఐఏఎస్ ప్రావిణ్య మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ పథకం కింద 948.55 కోట్ల రూపాయలతో 66 అభివృద్ధి పనులను చేపట్టగా అందులో ఇప్పటికే 27 పనులు పూర్తయినాయని, మిగిలిన వివిధ పురోగ దశలలో కొనసాగుతున్న 39 పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ జూలై వరకు పూర్తి చేసేలా అధికారులు, గుత్తేదారులు సమన్వయంతో కృషి చేయాలన్నారు. జంక్షన్ల అభివృద్ధి లో భాగాంగా కొత్తవాడ జంక్షన్ లో కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం, మగ్గం ఉండే విధంగా అభివృద్ధి, సుందరికరణ చేయాలని వారు ఆదేశించారు.
వడ్డేపల్లి బండ్ అభివృద్ధి పనులు, భద్రకాళి బంద్ జోన్ డీ జోన్ ఈ పనుల పురోగతి, 5 గ్రాండ్ ఎంట్రెన్సులు, ఉర్స్ గుట్ట బండ్ అభివృద్ధి, ఎఫ్ ఎస్ టి పి, ఎస్ టి పి లు, ట్రాన్స్ఫర్ స్టేషన్లు, ల్యాండ్రో మార్ట్ లు, ఆర్1, నుండి ఆర్10 స్మార్ట్ సిటీ రోడ్లు, ఆర్ ఇ సి నుండి కేయుసి రోడ్డు వరకు, ఊర చెరువు గోపాల్పూర్ నుండి ప్రెసిడెంట్ పాఠశాల వరకు అండర్ గ్రౌండ్ డక్ట్ పనులు, ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, తదితర కొనసాగుతున్న అభివృద్ధి పనుల పురోగతిని కూలంకషంగా సమీక్షించి , వేగవంతంగా పూర్తి అయ్యేలా సంబంధిత అధికారులు నిత్యం పర్యవేక్షించాలని అన్నారు.
రోడ్ల విస్తరణ, నాలలపై కల్వర్టుల ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ పనులలో అవరోధాలు ఏర్పడకుండా పట్టణ ప్రణాళిక అధికారులు సమన్వయం చేసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లకు పెండింగ్ లో లేకుండా బిల్లులు చెల్లిస్తున్నామని, మెన్ అండ్ మెటీరియల్ను పెంచి నిర్ణిత గడువులోగా పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో కాంట్రాక్టర్ల బిల్లులలో కోత విధించడంతో పాటు జాప్యానికి పెనాల్టీలు వేయడం జరుగుతుందని హెచ్చరించారు.
ఈ సమీక్షలో బల్దియా ఎస్ ఈ ప్రవీణ్ చంద్ర, స్మార్ట్ సిటీ పీఎంసి ఆనంద్ ఓలేటి, సి హెచ్ ఓ శ్రీనివాసరావు, డిసిపి ప్రకాశ్ రెడ్డి, బల్దియా, కుడా, ఇరిగేషన్ ఈఈలు రాజయ్య సంజయ్ కుమార్, భీం రావు, ఆంజనేయులు, బల్దియా, కుడా, ఇరిగేషన్, విద్యుత్, పట్టణ ప్రణాళిక అధికారులు, వివిధ ఏజెన్సీల గుత్తేదారులు తదితరులు పాల్గొన్నారు.