Warangal Mayor  to join Congress  :  వరంగల్ నగరంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టిఆర్ఎస్ అధికారానికి దూరమై నెలరోజులు దాటగానే ఆ పార్టీల నేతలు, ప్రజాప్రతినిధులు హస్తం వైపు చూస్తున్నారు. రాజకీయ స్వలాభం కోసం కొందరు, పదవులను కాపాడుకోవడానికి మరికొందరు కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు చేసుకుంటున్నారు. చాలా చోట్ల మున్సిపాలిటీల్లో కార్పొరేటర్లు పార్టీ మారుతూంటే..  వరంగల్‌లో మాత్రం  మేయర్   గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారు.  


కాంగ్రెస్‌తో గుండు సుధారాణి చర్చలు            
  
గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైంది. వరంగల్ కార్పొరేషన్ మేయర్ గా, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా గుండు సుధారాణి కొనసాగుతున్నారు.  బీఆర్ఎస్ పార్టీ అధికారానికి దూరం కావడం, రాష్ట్రంలో చోటు చేసుకున్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో సుధారాణి కాంగ్రెస్ లోకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందు కోసం కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ నేతలు వేం నరేందర్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, సీతక్కలతో టచ్ లో ఉంటూ రంగం సిద్ధం చేసుకున్నట్లు రాజకీయ చర్చ జరుగుతుంది. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరేందుకు సైతం ముహూర్తం ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. 


13 మంది కార్పొరేటర్లతో సహా పార్టీ మార్పు                    


గుండు సుధారాణితో పాటు వరంగల్ తూర్పు నియోజకవర్గానికి చెందిన 13 మంది కార్పొరేటర్లు పార్టీ మారే  అవకాశం ఉంది. ఇప్పటికే చేరికకు ముహుర్తం ఖరారు చేసుకున్నారని ఈ నెల 20వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో చేరనున్నట్లు  చెబుతున్నారు . 20వ తేదీ కాకుంటే మరో తేదీని ఫిక్స్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.  గుండు సుధారాణి టీడీపీ తో రాజకీయ రంగప్రవేశం చేశారు.  టిటిడి బోర్డ్ మెంబర్‌గా  , రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతూ తెలంగాణ ఏర్పాటు తరువాత బీఆర్ ఎస్ లో చేరారు.  వరంగల్ తూర్పు నుంచి 2018లో టిక్కెట్ ఆశించినా లభించలేదు.   2021 లో జరిగిన గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ కు ఎన్నికల్లో మేయర్ గా  ఎన్నికయ్యారు.  


బీఆర్ఎస్‌ను వీడిపోతున్న కార్పొరేటర్లు                                      


ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అత్యధికంగా 48 సీట్లు గెలుచుకుంది. 10 సీట్లు బీజేపీ, కాంగ్రెస్ 7, స్వతంత్రులు ఒక్కరు గెలిచారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా వరంగల్ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన 6 కార్పొరేటర్లు ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరారు. వరంగల్ తూర్పు నుంచి మరో 13 మంది కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారు. వీరి చేరికతో బీఆర్ ఎస్ మేయర్ సీటు కోల్పోనుంది.  సుధారాణి మేయర్ పదవి కాపాడుకోవడానికి కాంగ్రెస్ లో చేరున్నట్లు భావిస్తున్నారు.