TSPSC Recruitment: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TSPSC)లో ఛైర్మన్, సభ్యుల పదవుల భర్తీకి ప్రభుత్వం జనవరి 12న నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ పోస్టుల దరఖాస్తు గడువు నేటితో (జనవరి18) ముగియనుంది. కమిషన్ పదవులకు సంబంధించి దరఖాస్తు గడువు జనవరి 12న ప్రారంభంకాగా.. జనవరి 18న సాయంత్రం 5 గంటల్లోగా అభ్యర్థులు ఈమెయిల్ ద్వారా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది. ఈ పదవులకు దరఖాస్తు చేసేందుకు వివిధ రంగాల్లో పనిచేస్తున్న పలువురు అర్హతలు, ఇతర వివరాల కోసం ఆరా తీస్తున్నారు. వచ్చిన దరఖాస్తులను ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ పరిశీలించి, అర్హులైన వారి పేర్లను ప్రభుత్వానికి ప్రతిపాదించనుంది. కమిటీ సూచించిన పేర్లను ప్రభుత్వం పరిశీలించి నియామకం కోసం గవర్నర్‌కు ప్రతిపాదనలు పంపుతుంది. గవర్నర్ నిర్ణయం మేరకు కమిషన్‌కు కొత్త ఛైర్మన్, సభ్యులు ఎంపికవుతారు.


రాజ్యాంగంలోని ఆర్టికల్ 316 ప్రకారం ఛైర్మన్, సభ్యులను గవర్నర్ నియమించనున్నారు. అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్ సర్వీసెస్ నిబంధనలకు లోబడి దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి దరఖాస్తులు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తులు నింపి, స్కానింగ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఈమెయిల్: secy-ser-gad@telangana.gov.in ద్వారా పంపాల్సి ఉంటుంది. ఎస్‌పీఎస్సీ చైర్మన్‌, సభ్యుల పదవులకు కావాల్సిన అర్హతలు, ఇతర వివరాలను నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు.


వివరాలు...


* టీఎస్‌పీఎస్సీ నియమాకాలు


1) ఛైర్మన్


2) కమిషన్ సభ్యులు


అర్హతలు..


➥  టీఎస్‌పీఎస్సీ నిబంధన 3 ప్రకారం.. కమిషన్‌లో ఛైర్మన్‌తో పాటు సభ్యులు 11 మందికి మించి ఉండటానికి వీల్లేదు. 


➥  కమిషన్‌లో సగంమంది సభ్యులు కేంద్ర, రాష్ట్రాల సర్వీసుల్లో పదేళ్ల సర్వీసు పూర్తిచేసిన వారై ఉండాలి. వీరిపై విజిలెన్స్ కేసులు ఉండకూడదు. మిగతా సభ్యులు అకడమిక్స్, మేనేజ్‌మెంట్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో నిపుణులై ఉండాలి. 


➥ కేంద్ర, రాష్ట్ర పీఎస్సీల సభ్యుల పదవీకాలం 6 సంవత్సరాలు కాగా.. ఆలోపు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) సభ్యుడి వయసు 65 సంవత్సరాలు, రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌(TSPSC)లో సభ్యుడి వయసు 62 ఏళ్లు నిండితే వారి పదవీకాలం పూర్తవుతుంది. ఇలాంటివారు.. మరోసారి ఆ పోస్టులో తిరిగి నియామకం పొందేందుకు వీల్లేదు.


దరఖాస్తు విధానం: అభ్యర్థులు వెబ్‌సైట్ నుంచి దరఖాస్తు డౌన్‌లోడ్ చేసుకోవాలి. దరఖాస్తు నింపి, స్కానింగ్ కాపీలను నిర్ణీత గడువులోగా సంబంధిత ఈమెయిల్ చిరునామాకు పంపాలి.


ఎంపిక విధానం: ప్రభుత్వం నియమించిన సెర్చ్ కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అభ్యర్థులను ఎంపికచేస్తారు.


దరఖాస్తు వివరాలు ఇలా..


➥ దరఖాస్తులో అభ్యర్థి తన వ్యక్తిగత వివరాలతోపాటు.. వృత్తి, ప్రభుత్వ సర్వీసులో పనిచేసి ఉంటే.. ఎంతకాలం పనిచేశారు, పదవీ విరమణ ఎప్పుడు చేశారన్న వివరాలు పొందుపరచాల్సి ఉంటుంది.


➥ విద్యార్హతల్లో డిగ్రీ, ఇతర కోర్సులు పాసైన తేదీ, పరీక్షల్లో తెచ్చుకున్న మార్కులు, డిస్టింక్షన్ వివరాలు, స్పెషలైజేషన్ సబ్జెక్టు వివరాలు తెలియజేయాలి.


➥ అధికారుల కేటగిరీలో ప్రభుత్వ సర్వీసులో ఎప్పటి నుంచి ఎప్పటివరకు ఏయే హోదాల్లో పనిచేశారో చెప్పాలి.


➥ ప్రముఖుల కేటగిరీలో అకడమిక్స్, మేనేజ్‌మెంట్, లా, సైన్స్ అండ్ టెక్నాలజీ, సోషల్ సైన్స్, హ్యుమానిటీస్ రంగాల్లో వారి సేవలను చెప్పాలి. గతంలో సాధించిన 5 విజయాల గురించి 200 పదాలకు మించకుండా రాసి, ఆ వివరాలు అప్‌లోడ్ చేయాలి. ప్రొఫెషనల్ రంగాలు, విద్యాసంస్థలు, సొసైటీలు లేదా రాజకీయ పార్టీలు, సంఘాలతో అనుబంధం వివరాలను తెలపాలి.


దరఖాస్తులు పంపాల్సిన ఈమెయిల్: secy-ser-gad@telangana.gov.in


ముఖ్యమైన తేదీలు..


➥ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 12.01.2024.


➥ దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 18.01.2024. (5 PM)


Notification


Application


Website