Punugulu Recipe : కాకినాడ కాజా, ఆత్రేయపురానికి పూతరేకులు ఎలాగో.. బెజవాడకు పునుగులు అలా అనమాట. మరి ఆ బెజవాడ పునుగులు మీరు తినేయాలనుకుంటే అక్కడికే వెళ్లాల్సిన పని లేదు. మీరు ఎక్కుడున్న ఆ రుచిని పొందెందుకు ఈ రెసిపీని ఫాలో అయిపోవడమే. అయితే దీనికోసం మీరు ప్రత్యేకంగా ప్రిపేర్ చేయాల్సిన పిండి ఏమి లేదు. ఇంట్లో దోశ పిండి ఉందా? అయితే మీరు వేడి వేడి పునుగులు తయారు చేసుకోవచ్చు. అదేంటి? దోశ పిండితో పునుగులు ఎలా చేసుకుంటారని అనుకుంటున్నారా? అయితే మీరు ఈ రెసిపీ గురించి తెలుసుకోవాల్సిందే. దీనిని ఎలా తయారు చేయాలి? కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. 


కావాల్సిన పదార్థాలు 


దోశ పిండి - 250 గ్రాములు


ఉప్పు - తగినంత


జీలకర్ర - 1 టీస్పూన్ 


ఉల్లిపాయ - 2


పచ్చిమిర్చి - 3


కరివేపాకు - 1 రెబ్బ


మైదా పిండి - దోశ బ్యాటర్​కి సరిపడినంత


నూనె - డీప్ ఫ్రైకి తగినంత


తయారీ విధానం


దోశ పిండి కాస్త పులిసింది ఉంటేనే పునుగులు టేస్ట్ వస్తాయి. ఇంట్లో దోశల కోసం పిండిని సిద్ధం చేసుకుంటాము కదా. అలాగే సిద్ధం చేసుకోవాలి. కొన్నిసార్లు దోశ పిండి మిగిలిపోతూ ఉంటుంది. అది అందరికీ సరిపోదు. అలా అని ఒకరిద్దరికో దోశలు వేసి.. మిగిలిన వాళ్ల కోసం వేరే టిఫెన్ చేయలేము. అలాంటప్పుడు మీరు ఈ పునుగులు ట్రై చేయవచ్చు. ఈ రెసిపీ మీకు మంచి టేస్ట్​ ఇవ్వడమే కాదు.. మీరు మరో టిఫెన్ చేయాల్సిన అవసరం లేకుండా చేస్తుంది. మరచిపోవద్దు దోశపిండి కాస్త పులిస్తేనే పునుగుల రుచి పీక్​లో ఉంటుంది.


ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు కడిగి చిన్నచిన్న ముక్కులుగా కోసుకోవాలి. ఇప్పుడు ఓ గిన్నెలో దోశ పిండి తీసుకుని.. దానిలో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అదే దోశ పిండిలో మైదా పిండిని విడతలు వారీగా వేసి.. పునుగులు వేసేందుకు వీలుగా వచ్చేంత వరకు పిండిని వేస్తూండాలి. మైదా త్వరగా ఉండలు కట్టేస్తుంది కాబట్టి.. బ్యాటర్​ను వీలైనంత వేగంగా కలుపుతూ ఉండండి. పిండిలో ఉండలు లేకుండా ఉంటేనే పునుగులు గుల్లగా వస్తాయి. 


పునుగులు వేసేందుకు పిండి రెడీ అయిపోయింది అనుకున్నప్పుడు స్టౌవ్ వెలిగించి.. దానిపై కడాయి పెట్టండి. దానిలో డీప్​ ఫ్రైకి సరిపడినంత నూనె వేసి.. వేడి అయ్యేవరకు వేచి చూడండి. ఇప్పుడు కాగిన నూనెలో పిండిని చిన్న చిన్న ముద్దులుగా వేయండి. నూనె సరిగా కాగకముందే పనుగులు వేస్తే.. అడుగంటిపోయే ప్రమాదముంది. నూనె వేడి అయిన తర్వాత వేస్తే పిండి వేసినా.. అది పైకి తేలుతూ వచ్చేస్తుంది. ఇలా వేసిన పునుగులను 50 శాతం వేగిన తర్వాత పక్కకి తీసేయండి. ఇలానే మరోసారి పిండితో పునుగులు వేయండి. అవి కూడా 50 శాతం వేగిన తర్వాత.. ముందుగా పక్కన తీసి పెట్టుకున్న పునుగులు కూడా వేసేయండి. ఇవన్నీ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి.. పక్కన పెట్టుకోవాలి. ఇలా చేస్తే అన్ని సరిసమానంగా వేగుతాయి. అంతే వేడి వేడి పునుగులు రెడీ.


పునుగులను మీరు నేరుగా తినేయొచ్చు. లేదంటే కొబ్బరి చట్నీతో.. లేదా టమాటా చట్నీతో కలిసి హాయిగా లాగించేయవచ్చు. వీటికి తోడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు ఉంటే వాటి రుచే వేరు. లేదంటే మీరు వీటిని టీతో పాటు కూడా తీసుకోవచ్చు. మీరు ఈ రెసిపీ కేవలం బ్రేక్​ఫాస్ట్​గానే కాదు.. సాయంత్రం స్నాక్స్​గా కూడా ట్రై చేయవచ్చు. 


Also Read : కరకరలాడే పెసర పునుగులు.. తయారు చేయడం ఇంత తేలికా అనిపించే రెసిపీ ఇదే