Kadavendi Village: పౌరుషానికి, తిరుగుబాటుకు ఆ గ్రామం నాందిపలికింది. భూమి కోసం... భుక్తి కోసం... వెట్టిచాకిరి విముక్తి కోసం సాగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం కడవెండి గ్రామంలో మొదలైంది. ఈ గ్రామంలో ఎటుచూసిన పోరాటయోధుల చిహ్నాలు కనిపిస్తాయి. గ్రామంలోకి వచ్చేవారికి పోరాట స్ఫూర్తి, పౌరుషం స్వాగతం పలుకుతుంది.
కడవెండి గ్రామం రక్తం చిందించిన నేల. దేశ్ ముఖ్ లు, రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేసిన కడవెండి గ్రామం ఎందరో పోరాట యోధులను అందించింది. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం కడవెండి గ్రామం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఊపిరి పోసింది. 1946 లో విస్నూర్ దేశ్ ముఖ్ రామచంద్రా రెడ్డి కి వ్యతిరేకంగా భూమికోసం, భుక్తి కోసం సాగిన పోరాటం తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించి రైతాంగ సాయుధ పోరాటంగా మారింది. ఎర్రజెండా నీడ కింద సాగిన పోరాటంలో రజాకార్ల తూటాలకు వీరమరణం పొందారు. దేశ్ ముఖ్, రజాకార్ల తూటాలకు బలైన తొలి అమరుడు దొడ్డి కొమురయ్య. ఈయన మృతి తో అప్పటి వరకు శాంతియుతంగా సాగిన పోరాటం తిరుగుబాటు గా మారింది. ఈ తిరుగుబాటులో ఎందరో అమరులయ్యారు. దొడ్డి కొమురయ్య, దొడ్డి మల్లయ్య, నల్ల నరసింహులు, ఎర్రంరెడ్డి మోహన్ రెడ్డి, సంతోష్ వంటి ఎందరో నాయకులు అమరులయ్యారు.
తెలంగాణలో అనేక ప్రజా పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచిన కడవెండి గ్రామంలో పోరాట యోధుల స్తూపాలు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తాయి. సుమారు 7 వేల జనాభా ఉన్న ఈ గ్రామంలో పోరాట స్ఫూర్తి రగులుతూనే వుంటుంది. తెలంగాణ సాయుధ పోరాటంలో అసువులు బాసిన యోధులతో పాటు కమ్యూనిస్టు యోధుల స్థూపాలు ఈ గ్రామంలో అడుగడుగునా కనిపిస్తాయి. గ్రామంలో గుడి, బడి తో పాటు యోధుల స్థూపాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. వర్ధంతి జయంతుల రోజు తుపాల వద్ద నివాళులు అర్పిస్తారు. ఈ గ్రామానికి తొలిసారిగా వచ్చినవారు స్వాగతం పలికే స్థూపాలను చూసి ఆశ్చర్య పోవాల్సిందే.
గ్రామంలో ఏంటి ఇన్ని స్థూపాలు ఉన్నాయని ఎవరిని అడిగినా మా గ్రామం ప్రజా పోరాటాల స్ఫూర్తి కి నిలయం, నెత్తురు పారిన నేల అని గొప్పగా చెప్పుకుంటారు. గ్రామాల్లో 20 అడుగుల ఎత్తు ఉండే స్థూపాలు 12 స్థూపాలు ఉన్నాయి. గ్రామం ఎంట్రెన్స్ లోని తొమ్మిది స్థూపాలు కనిపిస్తాయి. కొద్ది దూరం వెళ్ళగానే దొడ్డి కొమురయ్య స్తూపంతో పాటు ఆయన విగ్రహం కనిపిస్తుంది. మరికొంత దూరం లో మరో రెండు స్థూపాలు ఉంటాయి. ఈ గ్రామంలో అమరుల స్థూపాలు కొత్త తరానికి స్ఫూర్తిని నింపుతువస్తున్నాయి. యోధుల స్పూర్తితో ప్రజా ఉద్యమాలతో పాటు నక్సల్స్ బరి ఉద్యమాల వైపు వెళ్ళారు.